ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు చుట్టూ పోలీసులు మోహరిస్తున్నారు. టీడీపీ ముఖ్య నేతల ఇళ్లను పోలీసులు మోహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉదయం నుంచి ముళ్ల కంచెలు వేస్తున్నారు. జిల్లాల కార్యాలయాల దగ్గరా అదే్ పరిస్థితి ఉంది. దీంతో టీడీపీ ముఖ్య నేతలందర్నీ ఏ క్షమమైనా అరెస్టులు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును కూడా కుప్పంలో అర్థరాత్రి సమయంలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. ఎవరూ ఆందోళనలు చేయకుండా టీడీపీ నేతలందర్నీ హౌస్ అరెస్ట్ లే్దా.. ఇతర కేసులు పెట్టి నిజంగానే అరెస్టులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ విషయంలో మీడియాపైనా ఆంక్షలు విధించడం.. ఇంటర్నెట్ ను కూడా నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని ఏపీలో జోరుగా పుకార్లు సాగుతున్నాయి. నిజానికి పోలీసులు ఈ స్థాయి మోహరింపు ఎందుకు చేస్తున్నారో చెప్పకపోవడం వల్లనే ఇలాంటి ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. కారణం ఏదైనప్పటికీ… భారీ స్థాయిలో పోలీసులు ప్లాన్ అమలు చేయబోతున్నారన్న విషయం మాత్రం స్పష్టమవుతోందని టీడీపీ నేతలంటున్నారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతలందర్నీ అరెస్టులు చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయని టీడీపీ నేతలంటున్నారు.
బ్రిటిష్ కాలం నాటి చట్టం ఆధారంగా ఇచ్చిన జీవో చెల్లుబాటుపై సందేహాలున్నా… ప్రభుత్వం మాత్రం ఈ చట్టం ఆధారంగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించాలని పోలీసుల విధులకు ఆటంకాలు కల్పించారన్న కారణాలు చూపి చంద్రబాబుపై కేసులు నమోదు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. రెండు కేసులు పెట్టినట్లుగా చెబుతున్నారు. అయితే ఎఫ్ఐఆర్ లు మాత్రం బయటకు రాలేదు. అలాగే కందుకూరు, గుంటూరు ఘటనల్లోనూ చంద్రబాబుపైనే కేసులు పెట్టి ఉంటారని.. అరెస్టు చేసిన తర్వాత వాటి ఎఫ్ఐఆర్ను బయట పెడతారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
మొత్తంగా ప్రభుత్వం ఎక్స్ ట్రీమ్ స్టెప్ వేయబోతోందన్న అంశం మాత్రం ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రతిపక్ష రాజకీయ నేతల్ని ఇప్పటి వరకూ అనేక రకాలుగా వేధించారు. ఇప్పుడు నేరుగా సామూహిక అరెస్టులకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతూండటం కలకలం రేపుతోంది. ఏం జరగబోతోంది అర్థరాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.