రాంగోపాల్ వర్మ బాణం ఇప్పుడు `అల్లు` వైపుకు తిరిగింది. అల్లు పేరుతో ఓ సినిమా తీస్తున్నానని వర్మ ప్రకటించేశాడు. అందులో ఏం చెప్పబోతున్నాడో చూచాయిగా వివరించాడు. చిరు వెనుక, ఆ కుటుంబం వెనుక, ప్రజారాజ్యం పార్టీ వెనుక, టోటల్ గా సినిమా పరిశ్రమ వెనుక.. అల్లు పాత్రేమిటన్నది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తన మాస్టర్ మైండ్ ఏపాటిదో అందరికీ తెలిసిన విషయమే. అయితే అల్లు ఖ్యాతి ఎలాగున్నా- ఆయనపై చాలా విమర్శలున్నాయి. వర్మ వాటినే ఫోకస్ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటి వరకూ వర్మ ఎన్ని వేషాలేసినా మెగా కుటుంబం కామ్ గానే ఉంది. `పవర్ స్టార్` సినిమా విషయంలోనూ అసలేమాత్రం స్పందంచలేదు. తన అన్నదమ్ముల్ని ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడిపోయే నాగబాబు సైతం వ్యూహాత్మకంగానే సైలెంట్ అయిపోయాడు. అయితే అల్లు అరవింద్ అలా కాదు. తను ఊరికే ఉండే రకం కాదు. వర్మని బ్యాన్ చేయాలన్న వాదన మొట్టమొదట తీసుకొచ్చింది అల్లునే. తనపైనే సినిమా తీస్తుంటే కామ్ గా ఎందుకు ఉంటాడు? ఏదో ఓ రియాక్షన్ తప్పకుండా ఉంటుంది.
కాకపోతే.. వర్మని ఇప్పుడు కెలికితే… అది తనకే ప్లస్ అవుతుందన్నది అల్లు కాంపౌండ్ భయం. ఇప్పుడు అల్లు వర్గం ఏమన్నా అది `అల్లు` సినిమా ప్రచారంలో వాడేసుకుంటాడు వర్మ. `పవర్ స్టార్` విషయంలో.. ఇదే జరిగింది. అప్పటి వరకూ లేని హైప్ లేని ఆ సినిమా వర్మ ఆఫీసుపై పవన్ అభిమానులు దాడి చేయడంతో.. పవర్ స్టార్‌కి ఇంకొన్ని ఎక్కువ టికెట్లు తెగాయి. ఇప్పుడు అల్లు స్పందించినా అదే తంతు. అందుకే.. `అల్లు` సినిమా బయటకు వచ్చేంత వరకూ కామ్ గా ఉండాలని అల్లు కాంపౌండ్ భావిస్తోంది. ఆ సినిమా వచ్చాక.. దాన్ని అడ్డు పెట్టుకుని, వర్మని టార్గెట్ చేయాలని భావిస్తున్నారు.
వర్మని తెలుగు ఇండ్రస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలన్న వాదనని మెగా ఫ్యామిలీ ఇప్పుడు మరోసారి బయటకు తీసుకుని రావొచ్చు. కానీ దాని వల్ల.. ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే వర్మకి థియేటర్లు అవసరం లేదు. ఆర్టిస్టులు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఇండ్రస్ట్రీనే అవసరం లేదు. తాను ఎక్కడున్నా సినిమాలు తీసి వదలగలడు. అందుకే ఆ పాయింట్ ని పక్కన పెట్టి.. అల్లు కొత్తగా ఏమైనా ఆలోచిస్తే మంచిది. లేదంటే… వర్మకి మరింత బలాన్ని ఇచ్చినవాళ్లవుతారు.