తన కంచు కోట చీరాల నుంచి పర్చూరు పంపి తన రాజకీయ జీవితాన్ని సమాధి చేయాలని ప్లాన్ చేసిన జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఆమంచి కృష్ణమోహన్ అంత కంటే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీని ధిక్కరించలేక.. జగన్ కాదంటే.. జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి.. ఆయన పర్చూరు ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు.. అది వైసీపీనే అవ్వాలన్న రూల్ లేదని కూడా అనుకుంటున్నారు. ఆయన దృష్టిలో జనసేన ఉంది.అందుకే ఆ పార్టీలో ఖర్చీఫ్ వేసుకుంటున్నారు.
ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేనలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జనసేన నేతగా నియోజకవర్గంలో ఆయన పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఆమంచి కృష్ణమోహన్ రాజకీయం చేస్తే.. స్వాములు రౌడీయిజం చేస్తారు. ఆమంచి వ్యవహారాలన్నీ స్వాములే చక్క బెడతారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా అణిచివేయాలన్నది ఆయన డిసైడ్ చేసుకుంటారు. అన్నదమ్ములిద్దరూ కలిసే ఈ రాజకీయాలు చేస్తారు చీరాల మొత్తం తెలుసు. ఇప్పుడు అన్నను కాదని స్వాములు వేరే పార్టీలో చేరుతారని ఎవరూ అనుకోవడం లేదు.
నిజానికి ఆమంచి జనసేనలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం లో ఉంది. ఇలా ప్రచారం జరిగినప్పుడు వైసీపీ నేతలు.. పవన్ ను.. ఆమంచితో ప్రెస్ మీట్ పెట్టి తిట్టించేవారు. ఇటీవల పవన్ పై ప్రెస్ మీట్లు పెట్టడం లేదు ఆమంచి. తన సీటులోకి టీడీపీ ఎమ్మెల్యేను ఆహ్వానించి వారికే టిక్కెట్ ఖరారు చేయడంతో ఆమంచి నమ్మి మోసపోయానని రగిలిపోతున్నారు. అందుకే ఆయన వచ్చే ఎన్నికలకు ముందు జగన ఝులక్ ఇవ్వడానికి రెడీ అయ్యారంటున్నారు.