“హైదరాబాద్ నుంచి పోటీ చేసే యోచనలో అమిత్ షా..” కొన్నాళ్ల క్రితం.. బీజేపీ క్యాంప్ నుంచి ఉద్ధృతంగా సాగిన ప్రచారం ఇది. చాలా మంది ఆశ్చర్యపోయారు. నిజమేనా అనుకున్నారు. అయితే దీనిపై బీజేపీ నేతలు చాలా కాన్ఫిడెంట్‌గా స్పందించారు. కచ్చితంగా పోటీ చేస్తారని చెప్పుకుండా… చేస్తే..సులువుగా గెలిచేస్తారని… ఉదరగొట్టేశారు. అప్పుడే అమిత్ షా హైదరాబాద్‌లో పోటీ చేస్తే .. తెలంగాణ లెక్కలు ఎలా ఉంటాయో కూడా అంచనా కు వచ్చారు. హైదరాబాద్‌లో అమిత్ షా పోటీ చేయడం వల్ల.. తెలంగాణ మొత్తం హిందూ ముస్లిం ఓట్లు పోలరైజ్ అవుతామని.. బీజేపీ గొప్పగా ఉనికి చాటుకుంటుందని చెప్పుకున్నారు. తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి.. బీజేపీ నేతలు.. తూచ్ అనేశారు. అమిత్ షా.. హైదరాబాద్ నుంచి పోటీ చేయబోవడం లేదని చెప్పడానికి… ఓవైసీపై… ఓ సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకుంటామని కవర్ చేస్తున్నారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు… అమిత్ షా హైదరాబాద్ నుంచి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇవ్వగానే.. అటు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైపీ.. సోషల్ మీడియాలో టీజ్ చేయడం ప్రారంభించారు. అమిత్‌షా హైదరాబాద్‌లో పోటీచేసినా తమ పార్టీయే గెలుస్తుందని సవాల్ చేశారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ మళ్లీ గెలవలేదని జోస్యం చెప్పారు. పెట్రోల్ధరల నియంత్రణ, యువతకు ఉద్యోగ కల్పనపై భాజపా తమ నిర్ణయాలను వెల్లడించాలని డిమాండ్‌చేశారు. గతంలోనూ ఓవైసీ ఇదే చాలెంజ్‌ను చాలా సార్లు చేశారు. హైదరాబాద్‌లో తనపై పోటీ చేయాలని… సవాల్ చేశారు. కానీ బీజేపీ మాత్రం… మొదట రెడీ అన్నట్లుగా ప్రచారం చేసి.. చివరికి వచ్చే సరికి వెనక్కి తగ్గింది.
హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో.. మతం ప్రకారమే ఓటింగ్ జరుగుతుంది. హిందువులు గణనీయ సంఖ్యలో ఉన్నా… ముస్లింలే మెజార్టీ. ముస్లం ఓట్లు గుంపగుత్తగా మజ్లిస్‌కే పడుతున్నాయి. గతంలో మజ్లిస్‌కు పోటీగా.. మజ్లిస్ బచావో తహరిక్..ఎంబీటీ అనే పార్టీ ఉండేది. మజ్లిస్‌తో పోటీగా ఓట్లు..సీట్లు కూడా సాధించేంది. క్రమంగా ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో.. మజ్లిస్‌కు ఎదురు లేకుండా పోయింది. ఎలా చూసినా.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో… మజ్లిస్ గెలుపు ఖాయం. అలాగే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కూడా. అందుకే.. ఓవైసీ దైర్యంగా.. బీజేపీ అగ్రనేతలకే సవాల్ చేస్తున్నారు.