పోలవరం ప్రాజెక్టు మీద ఏపీ భాజపా నేతలందరికీ ఒకే అభిప్రాయం ఉన్నట్టుగా ఇంతవరకూ కనిపించలేదు! వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుపై స్పష్టమైన వైఖరిని ఏపీ నేతలు వ్యక్తీకరించలేకపోతున్నారు. పరిహారం చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కొంతమంది నేతలు ఆరోపిస్తుంటే, తాజాగా వైకాపా సర్కారు ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ వల్ల నష్టం జరుగుతుందని మరికొందరు విమర్శిస్తున్న పరిస్థితి. టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఇన్నాళ్లూ విమర్శిస్తూ వచ్చిన భాజపా నేతలు… ఇప్పుడు సీఎం జగన్ తెచ్చిన రివర్స్ టెండరింగ్ ని కూడా తప్పుబడుతున్నారు. ఇదే అంశమై కేంద్రం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఇంతకీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో భాజపా ఏ వైఖరితో ఉందీ, టీడీపీ హయాంలో జరిగిందంటూ ఆరోపిస్తున్న అవినీతిపై ముందుకెళ్తారా, వద్దంటున్నా వినకుండా జగన్ సర్కారు టెండర్ల విషయంలో ముందుకెళ్తున్న తీరుపై చర్యలు అంటారా అనేది స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో ఈ నెల 11న పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు భాజపా నేతలు వెళ్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం తీరుపై ప్రధానంగా అధ్యయనం చేయనున్నారు. దీంతోపాటు, ముంపు ప్రాంతాల్లో పర్యటించి, పరిహార చెల్లింపుల్లో జరిగిన అవినీతిపై కూడా స్పందిస్తారని భాజపా నేతలు అంటున్నారు. అంటే, గత టీడీపీ, ప్రస్తుత వైకాపా విధానాలకు వ్యతిరేకంగా భాజపా వ్యవహరిస్తుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
అయితే, ఇన్నాళ్లూ కేవలం విమర్శలకు మాత్రమే ఏపీ భాజపా నేతలు పరిమితమౌతూ వచ్చారు. వాస్తవానికి పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఇంకా రూ. 6 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వాటి విడుదలపై ఇప్పటివరకూ కేంద్రం కూడా ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. ఇప్పుడు ఏపీ భాజపా నేతలు ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమేదైనా చేస్తారో లేదో చూడాలి. వాస్తవానికి భాజపా నేతలు చెయ్యగలిగిన పనీ, చెయ్యాల్సిన పని కూడా ఇదే. గత, ప్రస్తుత ప్రభుత్వాలపై విమర్శలకే పరిమితం కాకుండా… ప్రాజెక్టు పనులు ముందు సాగేలా అవసరమైన కేంద్ర చర్యలకు డిమాండ్ చెయ్యాలి. ఇది ఎలాగూ జాతీయ ప్రాజెక్టు కాబట్టి, కేంద్రమే నిర్మాణ పనుల్లో జోక్యం చేసుకుంటుందా అనేదీ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా.. ఏపీలో భాజపా రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంలో కదలిక ఉంటుందనేది వాస్తవం.