హైదరాబాద్‌లోని విజయా డైరీ ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని తెలంగాణ హైకోర్టు చెప్పిన తీర్పు … ఆంధ్రాకు ఆశావహంగా కనిపిస్తోంది. ఎందుకంటే… ఒక్క విజయా డైరీ మాత్రమే కాదు.. ఉమ్మడి సంస్థల ఆస్తులు అత్యధికం హైదరాబాద్‌లో ఉన్నాయి. అవన్నీ తామేనని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. జనాభా ప్రాతిపదికన పంచాలని అంటోంది. ఈ పీట ముడి .. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత … రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తులపై వివాదం ఏర్పడింది. కేంద్రం పట్టించుకోవడం లేదు.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నత విద్యామండలి ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఆ తీర్పును రకరకాల కారణాలతో ఇంత వరకూ తెలంగాణ సర్కార్ అమలు చేయలేదు. అదే తీర్పును మిగతా అన్ని ఉమ్మడి ఆస్తుకు అన్వయింప చేయాలని… ఏపీ సర్కార్ కోరుతోంది. తెలంగాణ సర్కార్ మాత్రం.. విభజన చట్టంలో ఉన్న సెక్షన్లకు సొంత అర్థం చెప్పుకుని ఎక్కడ ఉన్నవి ఆ రాష్ట్రాలకేనని వాదిస్తూ వస్తోంది.దాంతో ఆస్తుల పంపకం నిలిపోయింది. విభజన అసంపూర్ణంగా ఉండిపోయింది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు.. ఈ ఆస్తుల పంపకంపై చాలా వివాదాలు జరిగాయి. మంత్రుల కమిటీలను నియమించి గవర్నర్ కూడా చర్చలు జరిపారు.
అయితే ఆయన.. కేవలం సెక్రటేరియట్ భవనాలను తెలంగాణ అప్పగించే వ్యూహంతోనే చర్చలు జరిపారనే ఆరోపణలు ఉన్నాయి. అవి ఫలించలేదు. దాంతో కోర్టు కేసులు నమోదయ్యాయి. ఏపీలో సర్కార్ మారిన తర్వాత ఏపీకి రావాల్సిన ఉమ్మడి ఆస్తులపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కరెంట్ బకాయిలు ఐదు వేల కోట్లు రావాల్సి ఉన్నా.. ఒక్క సారి కూడా అడగలేదు., గత ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ సంస్థలపై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్ కూడా వేసింది. కొత్త ప్రభుత్వం వచ్చాక ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు పంచడానికి తెలంగాణ సర్కార్ ఆసక్తి చూపించదు. కోర్టు తీర్పు ఇచ్చినా ఏదో ఓ రకంగా ఆస్తులను పంచకుండా ఉండటానికే ప్రయత్నిస్తుంది.
ఇప్పుడు న్యాయం ఏపీ సర్కార్ వైపు ఉంది. మరి ఈ న్యాయాన్ని అంది పుచ్చుకుని ఏపీకి రావాల్సిన ఆస్తులను.. ఏపీ సర్కార్ సాధించగలుగుతుందా.. లేకపోతే… వాటి వల్ల ఉపయోగం లేదని సైలెంట్‌గా ఉంటారో వేచి చూడాలి. తెలంగాణ నుంచి ఏపీకి ఉమ్మడి ఆస్తులు దాదాపురా రూ. అరవై వేల కోట్ల వరకూ రావాల్సి ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.