కృష్ణానది వరదలు ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైపరీత్యమే అని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విమర్శించిన సంగతి తెలిసిందే. దీన్ని వెంటనే తిప్పి కొట్టేందుకు రాష్ట్ర జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తన వ్యంగ్య ధోరణిలో, ఏనాడైనా చంద్రబాబు నిజాలు చెప్పారా అనీ, చింత చచ్చినా పులుపు చావలేదంటూ ప్రజలు ఎందుకు ఓడించారో ఆయనకి ఇంకా అర్థం కావడం లేదనీ, కరువుని సృష్టించింది ఆయనేననీ.. ఇలా చాలా తరచూ విమర్శిస్తున్న తరహాలోనే తిప్పి కొట్టారు. ఈ సమయంలో కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన ఇంటి ముంపు గురించే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడారనే వ్యాఖ్య కొంత సమంజసంగానే ఉంది. రాజకీయ వ్యాఖ్యానాలు కాసేపు పక్కనపెడితే… వరద రూపంలో రాష్ట్రానికి భారీ ఎత్తున నీరు వచ్చింది. దాన్ని రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకునే ప్రయత్నాన్ని జలవనరుల శాఖగానీ, మంత్రిగానీ ప్రయత్నించారా… అనేది చర్చించాల్సిన అంశమే.
ఆల్మట్టీ నుంచి నారాయణపూర్, జూరాల మీదుగా శ్రీశైలానికి పెద్ద మొత్తం నీరు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల మొదటివారంలో నీరొచ్చింది. అయితే, నీరు వచ్చీరాగానే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించుకుంది. అదే రోజున పవర్ జనరేషన్ కూడా తెలంగాణ ప్రారంభించేసింది. నాలుగో తేదీని నీళ్లొస్తే… అదే రోజున పొరుగు రాష్ట్రం దాన్ని వినియోగించుకుంటూ ఉంటే… ఆరో తేదీ వరకూ ఆ నీటిని రాయలసీమకు తరలించొచ్చు అని ఏపీ జలవనరుల శాఖ ఆలోచించనే లేదు! నిజానికి, ఆరోజునే పోతిరెడ్డిపాడుకి నీటిని విడుదల చెయ్యొచ్చు. కానీ, వెంటనే ఆ పని చెయ్యకుండా మర్నాటి నుంచి దాదాపు పదిరోజులపాటు కొద్దికొద్దిగా నీటిని విడుదల చేశారు. ఒక పద్ధతి ప్రకారం అందుబాటులో ఉన్న నీటిని తలరించలేదనేది నిపుణుల మాట. బ్రహ్మంగారిమఠం రిజర్వాయరు, గండికోట, మైలవరం, సోమశిల, కండలేరు… ఇవన్నీ ఖాళీగా ఉన్న పరిస్థితి ఉందంటున్నారు! వరద నీరు వస్తోందని తెలిసిన మొదటి రోజు నుంచీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి ఒక పద్ధతి ప్రకారం నీరు తెచ్చి ఉంటే… ఈరోజున ఇవన్నీ పూర్తిగా నిండే అవకాశం ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వరదలు ప్రారంభయ్యాక కేవలం రాజకీయ విమర్శల మీద మాత్రమే జలవనరుల మంత్రి అనిల్ కుమార్ ఫోకస్ పెట్టారు తప్ప, నీటిని సద్వినియోగం చేసుకోవడంపై ఆయన ఆలోచించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత రాయలసీమ ప్రాంతం కరువులో ఉందని తెలిసీ, నీరు అందుబాటులోకి వచ్చాక కూడా దాన్ని నిర్వహించలేని పరిస్థితిలో మంత్రి ఉన్నారనీ, మీడియా సమావేశాల్లో జోకులేసుకుంటూ ఆయన కాలం గడిపేశారనే విమర్శలు కొంతమంది చేస్తున్నారు.