ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ నేతలు, తెలుగుదేశం అధినేత , రాజ్యసభలో వెంకయ్యనాయుడు ఏం మాట్లాడారో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. తెలుగుదేశం అధినేత అయితే.. బీజేపీ, తెలుగుదేశం కూటమిని గెలిపించినట్టు అయితే.. రాష్ట్రానికి పది, పదిహేనేళ్ల ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని, తద్వారా ఏపీ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇక రాజ్యసభ లో వెంకయ్య ప్రసంగం సరే సరి! ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ వాళ్లు అంటుంటే.. ఐదు కాదు , పదేళ్లు ప్రకటించాలని వెంకయ్య అప్పట్లో డిమాండ్ చేశారు.
ఇక ఎన్నికల్లో ఈ కూటమి అధికారంలోకి రావడంతోనే అందరూ వరసగా నాలుకలు మడతేయడాలు కూడా ఎవరికీ తెలియనేవేమీ కాదు. అయితే ఇలా మాట తప్పడాన్ని అందంగా సమర్థించుకోవడం రాజకీయ నేతలకే సాధ్యం అవుతోంది. ఇది వరకూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సమాధానం చెప్పాల్సిన తరుణంలో తెలుగుదేశం నేతలు, బీజేపీ నేతలు తలా ఒక రీజన్ చెప్పే వాళ్లు. వీటిలో నారా లోకేష్ ఒక చిత్రమైన రీజన్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే.. ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా తమిళనాడు వంటి రాష్ట్రాలు అడ్డు పడుతున్నాయని లోకేష్ సెలవిచ్చారు. తమిళనాడు మాత్రమే కాకుండా.. ఇంకా అనేక రాష్ట్రాలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా అడ్డు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ నేతలు అయితే.. ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తే మాకూ కావాలని.. అనేక రాష్ట్రాలు కేంద్రం వెంట పడతాయని కమలనాథులు చెప్పుకొచ్చారు.
అయితే ఏపీ కి ప్రత్యేక హోదా అంశంపై ప్రైవేట్ బిల్లు హడావుడి నేపథ్యంలో పరిణామాలను గమనిస్తే.. ప్రత్యేక హోదాకు పక్క రాష్ట్రాలు అడ్డు పడటం.. ఏపీకి ఈ హోదా దక్కకూడదని ప్రయత్నించే రాష్ట్రాలు ఉన్నాయని అనడం ఉత్తుత్తిదే అని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ ప్రతిపాదిత ప్రైవేట్ బిల్లు పట్ల తమిళనాడు రాజకీయ పక్షాలు కానీ, దేశంలోని వేరే రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ అడ్డు చెప్పలేదు! తమిళనాడుకు చెందిన ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లు ప్రతిపాదనను స్వాగతించాయి కూడా! దీన్ని బట్టి.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పక్కరాష్ట్రాల అభ్యంతరాలు ఉత్తుత్తి రీజన్లే, అసలు దోషులు అధికారంలో ఉన్న వారే అని స్పష్టత వస్తోంది!