హుజురాబాద్ ఉపఎన్నిక పొలిటికల్‌గా ఎంత హైవోల్టేజ్ సృష్టించిందో .. ఎన్నిక ముగిసిన తర్వాత వివాదాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని వీవీ ప్యాట్లను కార్లలో తరలిస్తూ దొరికిపోయారు. వీవీ ప్యాట్లను కార్లలో తరలించడం ఏమిటని విపక్షాలు మండిపడ్డాయి. గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు ప్రారభించాయి.అయితే ఎన్నికల అధికారి మాత్రం అలాంటిదేమీ లేదని… అవి మాక్ పోలింగ్‌లో వాడిన వీవీ ప్యాట్లు అని కవర్ చేసుకున్నారు. కానీ విచారణకు మాత్రం ఆదేశించింది.
అలాగే ఈవీఎలు తీసుకెళ్తున్న ఓ బస్ కు పంక్చర్ కావడంతో రోడ్డుపై రెండు, మూడు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో మరోసారి దుమారం రేగింది. గోల్ మాల్ నిజమని ఆరోపణలను విపక్ష నేతలు చాలా బలంగా చేస్తున్నారు. సున్నితమైన ఎన్నిక జరిగినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలను జాగ్రత్తగా డీల్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుంది. ఇలాంటివి జరగడం వల్లే రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
ఎన్నికలు వీలైనంత వరకు పారదర్శకంగా జరిగినా ఈవీఎంలు వీవీ ప్యాట్ల విషయంలో ఏర్పడిన గందరగోళం కారణంగా రేపు టీఆర్ఎస్ అభ్యర్థి విజయ సాధించినా అనుమానాలు అలాగే ఉండిపోతాయి. అది అధికార పార్టీకి నష్టం చేస్తుంది. ఎన్నికల ప్రక్రియ విషయంలో ప్రజల్లో నమ్మకం కలిగేలా వ్యవహరించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంతో పాటు రాజకీయ పార్టీలపైనా ఉంటుంది.