తెలంగాణలో ఆపరేషన్ భాజపా ప్రారంభం కావడానికి అవసరమైన వేదిక లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఏర్పడిందనే చెప్పాలి. మరో ఐదేళ్ల నాటికి రాష్ట్రంలో ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు కమలదళం చేస్తుంది. అయితే, కేంద్రంతో సయోధ్యగా మెలుగుతూ… అవసరమైనప్పుడు మెచ్చుకుంటా, వద్దనుకున్నప్పుడు విమర్శిస్తా అనే ధోరణిని సీఎం కేసీఆర్ గతంలో మాదిరిగా కొనసాగిస్తూ పోయినా… భాజపా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే… భాజపాకి ప్రస్తుతానికి ఏరకమైన ప్రాతినిధ్యమూ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవ లేకపోయింది. అలాగని, ఆంధ్రాలో పార్టీ విస్తరణ కార్యక్రమాలను ఆపేస్తుందా..? కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా భాజపాకి అత్యంత అనుకూల ధోరణితో వ్యవహరిస్తారని ముందుగానే తేలిపోయింది. ప్రధానిని బతిమాలి ప్రత్యేక హోదా సాధిస్తా అంటూ దాదాపుగా మోకరిల్లేశారు. అంతమాత్రాన, ఏపీలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా దొరికిన మిత్రపక్షంగానే వైకాపాను భాజపా చూస్తుందా..? అంటే… కాదనే చెప్పాలి.
కేంద్రంలో మరోసారి తిరుగులేని ప్రభుత్వంగా భాజపా ఉన్నప్పుడు… ఇప్పటివరకూ ప్రాతినిధ్యం లేని రాష్ట్రాల్లో భాజపా కచ్చితంగా పుంజుకునే ప్రయత్నమే చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే, ఏపీలో వైకాపా ప్రస్తుతానికి భాజపాకి అనుకూలంగా కనిపిస్తున్నా… గత హయాంలో మిత్రపక్షమైన టీడీపీ భాజపాకి ఏకుమేకైన అనుభవాన్ని మోడీ షా ద్వయం మరిచిపోరు కదా! ఆ స్థాయికి జగన్ ను ఎదగనిస్తారా..? ప్రస్తుతం జగన్ ఢిల్లీకి అనుకూలంగా ఉండటానికి ఆయనకు ఉన్న కారణాలు, అవసరాలు చాలా ఉన్నాయి. అలాగని, రాష్ట్రంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలను భాజపా మానుకోదనే చెప్పాలి.
అయితే, ఏపీలో భాజపాకి అవకాశం పెంచే అంశాలేవున్నాయి అంటే… ఓరకంగా టీడీపీ నేతలే వారి టార్గెట్ అవుతారని కూడా చెప్పొచ్చు. ఏపీలో తెలుగుదేశం మీద వైకాపా రాజకీయ కక్ష సాధింపులు కచ్చితంగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇలాంటి సమయాన్ని భాజపా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. వైకాపా నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొవాలంటే… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి చేరడమే మంచిదనే అభిప్రాయాన్ని భాజపా వాడుకుంటుందని చెప్పొచ్చు. టీడీపీలో కొంతమంది వ్యాపారవేత్తలు నాయకులుగా ఉన్నారు. రాబోయే ఐదేళ్లలో వారిని భాజపా టార్గెట్ చెయ్యొచ్చు! ఆ ఒత్తిళ్లను తట్టుకునే బదులు… భాజపాలో చేరిపోవడమే వారికి తరుణోపాయం అనే పరిస్థితిని సృష్టించొచ్చు. ఇప్పటికిప్పుడు ఆపరేషన్ ఆంధ్రాను భాజపా ప్రారంభించకపోయినా… ఏపీలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు, సరైన సమయం చూసుకుని వారి దగ్గరున్న అన్ని అస్త్రాలనూ భాజపా వాడుతుందనడంలో సందేహం లేదు.