ఏపీ బీజేపీకి ప్రభుత్వాన్ని వ్యతిరేకించకపోతే.. వచ్చే ఓట్లు కూడా రావని కంగారు పడుతోంది. ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను గుర్తించి.. వీలైనంత వరకూ పోరాటం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. కానీ కేంద్రం నిర్ణయాలతో వారి పోరాటాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనపై నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు ఏపీలో పర్యటించాసని నిర్ణయించారు.
హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చెరో బహిరంగసభలో ప్రసంగించనున్నారు. హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖపట్నం రానున్నారు. విశాఖలో మోదీ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేళ్ల విజయాలపై బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. అలాగే పదో తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు. తిరుపతిలో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ లో కేర్ తీసుకున్నట్లుగా ఏపీ బీజేపీ గురించి పట్టించుకోవడం లేదు. చేరికల కోసం ప్రయత్నించడం లేదు. వైసీపీతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. కనీసం జనసేనతో పొత్తును కంటిన్యూ చేయాలన్న ప్రయత్నాలు కూడా చేయడం లేదు. దీంతో ఏపీ బీజేపీ నేతలు తాము ప్రభుత్వానికి వ్యతిరేకం… హైకమాండ్ అనుకూలం అని నిట్టూర్పు విడిచి.. చెప్పిన పని చేసుకుంటూ పోతున్నారు.