ఓ వైపు తెలంగాణలో పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు ఉంది.. ఆ పార్టీతోనే ఉంటామని ప్రకటించారు.. కానీ ఏపీలో మాత్రం బీజేపీ అసలు తాము జనసేనతో పొత్తులో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తోంది. భీమవరంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించింది. అందులో ఎక్కడా .. తాము మిత్రపక్షాలతో కలిసి ఉన్నామనీ కానీ ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని.. అధికారంలోకి వస్తామని కానీ వ్యాఖ్యలు చేయలేదు. వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా తాము ఎదుగుతామని తీర్మానం చేసుకున్నారు కానీ .. కనీసం జనసేనను గుర్తించడానికి కూడా ఆసక్తి చూపించలేదు.
డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి.. ఏపీ అభివృద్ధి చెందాలని … తీర్మానంలో రాసుకున్నారు. జనసేన రాజకీయ తీర్మానం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. టీడీపీ, వైసీపీలతో పొత్తులు పెట్టుకునే అవకాశాల్లేవని స్పష్టమయింది. మరి జనసేన విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదన్నది కీలకం. జనసేన ఇటీవల ఓట్లను చీల్చబోమని.. చెబుతూ వస్తోంది. చంద్రబాబుతో రెండు సార్లు పవన్ సమావేశం అయ్యారు. తర్వాత పొత్తులు పెట్టుకోవాలంటే గౌరవం కావాలని అన్నారు. అధికారికంగా పొత్తులపై చర్చలు జరిగాయో లేదో స్పష్టత లేదు. కానీ బీజేపీ మాత్రం పవన్ టీడీపీకి దగ్గరయ్యారని ఫిక్సయిపోయి.. ఆ పార్టీని ఇగ్నోర్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ తెలంగాణలో తెలంగాణ రాజకీయాలపైనే మాట్లాడారు. అక్కడ బీజేపీతో కలిసి ఉంటామన్నారు. అక్కడ ఉంటామంటే… ఏపీలో కూడా ఉంటామని చెప్పిటన్లే అనుకోవచ్చు. మరి ఈ ప్రకటనను ఆసరా తీసుకుని అయినా జనసేనతో కలిసి రాజకీయ పోరాటం చేస్తామని… ఓ పదం రాజకీయ తీర్మానంలో పెట్టి ఉంటే.. పవన్ ను గౌరవించినట్లుగా ఉండేది. కానీ బీజేపీ అలాంటి చొరవ తీసుకోలేకపోయింది.