ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ తన టీంను పునర్వవ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. మంత్రివర్గ విస్తరణ జరిగిన ప్రతీ సారి దేశంలో అనాథగా ఉండిపోయిన ఏపీకి ఓ మంత్రి వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు ఉంటారు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఆ అవకాశం దక్కింది. తమిళనాడు, కేరళలకు కూడా కేబినెట్ మంత్రులున్నారు. కానీ ఏపీకి మాత్రం.. కేంద్రమంత్రి లేకుండా పోయారు.
బీజేపీ తరపున ఏపీ నుంచి ఎంపీలు ఎవరూ లేరు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్, సుజనా చౌదరి పదవి కాలం ముగిసింది. సీఎం రమేష్ పదవి కాలం ఉంది. సాంకేతికంగా ఆయన బీజేపీ ఎంపీనే. అలాగే జీవీఎల్ నరసింహారావుకూ పదవీ కాలం ఉంది. కానీ ఆయన యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కానీ బీజేపీ హైకమాండ్ నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు పంపడం లేదు. ఏపీకి ఓ కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే.. సీఎం రమేష్ లేదా జీవీఎల్‌లకు మాత్రమే చాన్స్ఉంది. ఇంకెవరిని తీసుకున్నా వారికి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ సారి మరో బీసీ నేతకు మంత్రి పదవి ఇవ్వవొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆయనతో పాటు ఇద్దరు లోక్ సభ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ కూడా బీసీ కేటగరిలోకే వస్తారు అయితే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. ధర్మపురి అర్వింద్ మొదటి సారి ఎంపీ అయ్యారు. లక్ష్మణ్ మాత్రం చాలా సీనియర్ అందుకే చాన్స్ ఇస్తే లక్ష్మణ్‌కే ఇవ్వొచ్చంటున్నారు.