ఏపీ భాజపా నేతల తీరు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలే ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ తరుణంలో… వారు మాత్రం పార్టీని వెనకేసుకుని వస్తున్నారు. ఈ తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… ఈ హౌస్ లో కూర్చున్నది ఒకర్నొరు విమర్శించుకోవడం కోసం కాదనీ, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతీ ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ప్రయత్నం చేయాలన్నారు. తెలుగువారి మనోభావాలను అర్థం చేసుకోని కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ఈ విషయాన్ని భాజపావారు గుర్తుంచుకోవాలనీ, ఇది తెలుగువారి మనోభావాలకీ ఆత్మగౌరవానికీ సంబంధించి అంశమని చంద్రబాబు చెప్పారు.
చాలా ఓపిగ్గా ఢిల్లీ చుట్టూ ఇరవై తొమ్మిదిసార్లు తిరిగాననీ, నిన్న కూడా రమ్మంటే రాష్ట్ర ఆర్థికమంత్రి వెళ్లారన్నారు. దక్షిణ భారతదేశంలో అతితక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రంగా ఉన్నామనీ, దాన్లో మన తప్పేమీ లేదనీ, దీన్ని సరిచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టే ఇన్ని రోజులూ మౌనంగా ఉన్నాననీ, లేకుంటే మరింత తీవ్రంగా పోరాటం చేసేవాడినని చెప్పారు. భాజపా నేతలు మాట్లాడాల్సింది ఇక్కడ కాదనీ, ఢిల్లీకి వెళ్లాలనీ, కేంద్రానికి పరిస్థితిని వివరించాలని చంద్రబాబు సూచించారు. ‘మేము అది చేశాం ఇది చేశాం అని ఇక్కడ మాట్లాడటం కాదు, చేయాల్సినవి చేయండి’ అంటూ ఆగ్రహించారు. ఆంధ్రా ప్రజల హక్కులను గౌరవించాలని మళ్లీ కోరుతున్నాననీ, రాష్ట్ర ప్రయోజనాల విషయమై తాను రాజీపడే ప్రసక్తే ఉండదని అన్నారు.
నిజానికి, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచీ ఏపీ భాజపా నేతలు కేవలం కేంద్రం వాణిని వినిపించేందుకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి ప్రయత్నం ఇంతవరకూ ఒక్కసారైనా చెయ్యలేదు. ఏపీ భాజపా నేతలంతా ఒక్కసారి ఢిల్లీకి వెళ్లి, విభజన హామీలేంటీ, కేంద్రం అమలు చేసినవి ఎన్ని, ఇంకా ఇవ్వాల్సినవేంటని రివ్యూ చేసుకుని ఉంటే… ఏపీలో భాజపాపై ఈరోజున ఇంత ఆగ్రహం వ్యక్తమై ఉండేదే కాదు. టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వడం మాత్రమే ఏపీ భాజపా నేతలు పనిగా పెట్టుకున్నారు. అంతేగానీ, వాస్తవాలను ఆలోచించడం లేదు. కనీసం ఇప్పటికైనా… ఏపీ భాజపా నేతలు ఢిల్లీ వెళ్లి, కేంద్రంతో చర్చలు జరిపితే బాగుంటుంది. రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టండీ… కనీసం ఏపీలో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసమైనా ఈ చర్య పనికొస్తుంది కదా.