ఏపీ భాజపా మాజీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు…ఈ మధ్య పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏం చెప్పారంటే… ఏపీకి కేంద్రం ఇవ్వాల్సినవి ఐదంటే ఐదే పెండింగ్ లో ఉన్నాయన్నారు! వాటిలో రెండోది విశాఖ రైల్వేజోన్. ఇవ్వడం సాధ్యం కాదని నివేదికలు వచ్చినా, ఎలాగైతే సాధ్యమౌతుందో అనే అంశమై ఒక కమిటీ వేశారనీ, త్వరలోనే రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటిస్తుందని చాలా ధీమాగా చెప్పారు. మూడోది కడప స్టీలు ప్లాంటు.. అది కూడా పరిశీలనలో ఉందన్నారు.
ఓ నెల్రోజులు వెనక్కి వెళ్తే… ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ… ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసొచ్చారు. హరిబాబు ఐదు అంశాలే పెండింగ్ ఉన్నాయంటే, కన్నా మాత్రం 12 అంశాలతో ఓ వినతి పత్రాన్ని ప్రధానికి ఇచ్చారు. దాన్లో మొట్టమొదటి అంశమే.. విశాఖ రైల్వే జోన్. రెండోది కడప స్టీల్ ప్లాంట్. వీటితోపాటు వినతి పత్రంలో ఉన్న 12 అంశాలపైనా ప్రధానమంత్రి అత్యంత సానుకూలంగా స్పందించారన్నారు.
గత నెల చివరి వారంలో, భాజపా నాయకుడు సోము వీర్రాజు… రైల్వేజోన్ పై కేంద్రం ఆలోచిస్తోందన్నారు! అంతకుముందు మరో లాజిక్ కూడా చెప్పారండోయ్. గతంలో విడిపోయిన ఛత్తిస్ గఢ్ లో రైల్వే జోన్ లేదు, ఉత్తరాంచల్ లో లేదు, జార్ఖండ్ లో కూడా లేదన్నారు. అయినాసరే, ఆంధ్రాకి ఇవ్వడానికి కేంద్రం సిద్దంగా ఉందనే లాజిక్ చెప్పారు. ఓపక్క పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంటే… కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు పదేళ్లు సమయం ఉన్నా, నాలుగేళ్లలోనే చాలా చేసేశామన్నారు.
ఇంకా చెప్పుకుంటూ పోతే… విశాఖ రైల్వే జోన్ పై సాక్షాత్తూ రైల్వేమంత్రి కూడా మాట్లాడారు. కేవలం పరిశీలించమనే విభజన చట్టంలో ఉందీ, అదే పని చేస్తున్నామంటూ నాలుగేళ్లు గడిచాక కామెడీ చేశారు! సరే, ఆంధ్రాకి జోన్ ఇవ్వరనేది చాలా స్పష్టంగానే ఉన్నా… ఆ విషయాన్ని నిన్నమొన్నటి వరకూ నేరుగా చెప్పేవారు కాదు. ఇవాళ్ల సుప్రీం కోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్ లో రైల్వే జోన్ సాధ్యం కాదని చాలా స్పష్టంగా చెప్పేశారు. మరి, కేంద్రం తరఫున వకాల్తా పుచ్చుకున్న హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి నేతలు ఇప్పుడేమంటారు..? ఇంతకీ, ఏపీ విషయంలో కేంద్రం మైండ్ సెట్ ఎలా ఉందో ఏపీ నేతలకు అర్థమౌతోందా..? లేదంటే, కేంద్రం ఆడిస్తున్నట్టు మాట్లాడుతున్నారా..? ఏదేమైనా, ఈ క్రమంలో సొంత రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నామనే ఆలోచన వీరిలో ఏ కోశానాలేనట్టుగానే ఉంది. తాజా అఫిడవిట్ నేపథ్యంలో ఏపీ భాజపా నేతలు, ఏపీ నేతగా చెప్పుకునే జీవీఎల్ ఏమంటారో చూడాలి.