ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన బీజేపీలో ఎందుకు చేరారన్న విషయం పక్కన పెడితే ఆయన చేరిక కార్యక్రమంలో ఏపీ బీజేపీ నేతలెవరూ పాల్గొనలేదు. చివరికి ఏపీ పీసీసీ చీఫ్ సోము వీర్రాజు కూడా దూరంగానే ఉండిపోయారు. ఇక ఏపీ బీజేపీ తరపున దిగ్గజాలుగా వ్యవహరిస్తున్న జీవీఎల్ నరసింహారావు,, పురందేశ్వరి సహా ఎవరూ కనిపించలేదు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు జై సమైక్యాంధ్ర పార్టీలో పని చేసిన విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమే ఆయనతో పాటు ఢిల్లీలో ఉన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి చేరిక బీజేపీలో ఇతర నేతలకు ఇష్టం లేదని ఈ పరిణామాలతో స్పష్టమయింది. అయితే సోము వీర్రాజు వర్గం మాత్రం ఆయన… కిరణ్కు ఫోన్ చేశారని.. కలసి పని చేస్తామని ప్రకటించారు. అసలే ఏపీ బీజేపీలో ఇప్పటికే మూడు గ్రుపులున్నాయి. ప్రో వైసీపీ.. ప్రో టీడీపీ… బీజేపీ గ్రూపులతో పాటు ఇప్పుడు కొత్తగా కిరణ్ గ్రూప్ కూడా తయారవుతోందన్న వాదన వినిపిస్తోంది. సోము వీర్రాజుకు సన్నిహితంగా వ్యవహరించిన వారు ఇటీవల ఆయన వ్యవహారశైలి కారణంగా దూరమవుతున్నారు. వారంతా కిరణ్ ఆధ్వర్యంలో గ్రూపుగా మారుతారని అంటున్నారు.
కిరణ్కు బీజేపీ హైకమాండ్ కూడా అంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రహ్లాద్ జోషితో కండువా కప్పించారు. సాయంత్రం జేపీ నడ్డాతో కిరణ్ సమావేశం అయ్యారు. ఆయనకు ఏ పదవి ఇస్తారన్నది స్పష్టత లేదు. ఏ పదవి ఇచ్చినా ఏపీ బీజేపీ నేతల్లో అసంతృప్తి ఖాయం. తమకు రావాల్సిన పదవి ఆయనకు ఇచ్చారని అనుకుంటారు. అయితే అసలు కిరణ్తో బీజేపీ ఎలాంటి ప్రయోజనం ఆశిస్తుందనేది ఇప్పుడు ఎవరికీ అంతుబట్టని విషయం.