తాలిబన్ల పాలనలో ఇన్స్టంట్ శిక్షలు వేసేస్తూంటారు. పాలకులకు వచ్చిన ఆగ్రహాన్ని బట్టి యాభై కొరడా దెబ్బలు.. వంద కత్తిపోట్లు… ఇలా వాళ్ల శిక్షలు ఉంటాయి. ఏపీలోనూ అవే అమలవుతున్నాయి. ప్రభుత్వాధినేతలకు ఎవరిపై కోపం వస్తే వారిని సీఐడీ పోలీసులు అర్థరాత్రి పట్టుకొస్తారు. తర్వాతి రోజు అర్థరాత్రి వరకూ “శిక్షలు అమలు” చేసి కోర్టుకు తీసుకెళ్తారు. న్యాయమూర్తి ముందు అతను భోరముంటే మహా అయితే వైద్య పరీక్షలకు పంపిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు చేసేది కూడా వాళ్ల టీమే. ఇక కావాల్సిందేముంది..?
ఘర్షణ మీడియా అనే పేరుతో టీవీ చానల్ నిర్వహిస్తున్న బొబ్బూరి వెంగళరావు అనే యువకుడు డీజీపీ ఆఫీసు దగ్గర టీడీపీ నేతలు నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు చూశారు. కేసులుంటే అప్పుడే పట్టుకోవాలి. కానీ పట్టుకోలేదు. ఆయన హైదరాబాద్ వెళ్తూంటే అర్థరాత్రి కోదాడ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు సీఐడీ ఆఫీసుకు తీసుకు వచ్చారు. మామూలుగా అయితే ఇలా అరెస్టులు చేయడం చట్ట విరుద్ధం. నోటీసులివ్వాలి. అయితే అలాంటి నోటీసులు అనే రాజ్యాంగం ఏపీలో అమలు కావడం ఎప్పుడో ఆగిపోయింది.
వెంగళవారును ఓ రోజు అర్థరాత్రి అదుపులోకి తీసుకుంటే మరో రోజు అర్థరాత్రి న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అర్థరాత్రే ఎందుకు హాజరు పరిచారంటే.. కొట్టిన దెబ్బలు బయటపడకూడదని. తాము శిక్ష వేశామని తెలియకూడదని. తనను సీఐడీ పోలీసులు ఎలా కొట్టారో.. జడ్జికి చెప్పి వెంగళరావు విలపించాడు. కొట్టిన విషయం చెబితే తన కొడుకును చంపుతానన్నారని భోరుమన్నాడు. సీఐడీ వేస్తున్న శిక్షల బాధితుడు వెంగళరావు మాత్రమే కాదు.. రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి వందల మంది ఉన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారంటూ.. వాళ్లపై వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం .. కొట్టడం..కామన్ అయిపోయింది.
సీఐడీ పోలీసులు అయినా.. మరెవరైనా తీసుకునేది జీతం ప్రజాధనమే. ఇలాంటి పనులు చేస్తున్నందుకు అదనంగా ఇంకేమైనా లభిస్తుందేమో కానీ ఇలా చేయడం మాత్రం చట్ట వ్యతిరేకం. పోలీసుల విధులకే మచ్చ. ప్రైవేటు సైన్యానికి.. సీఐడీపోలీసులకు తేడా ఉండదు. కానీ ఇప్పుడు ఏపీలో ఆ తేడా చెరిగిపోయింది.