ఒకటి రెండు వారాల్లో కేంద్రమంత్రివర్గ విస్తరణ ఉండబోతోందని.. ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కేంద్రమంత్రివర్గ విస్తరణ ప్రధానంగా.. తన మిత్రపక్షం జేడీయూని సంతృప్తి పరచడానికేనని..బీజేపీ పెద్దలు చెబుతున్నారు. బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ.. పూర్తి మెజార్టీ సాధించింది. అప్పుడు మిత్రపక్షాలకు.. ఒక్కొక్క కేంద్రమంత్రి పదవి మాత్రమే ఇచ్చారు. అయితే.. ఆ ఒక్కటి తమకు అవసరం లేదని.. బీహార్ మిత్రపక్షం జేడీయూ తిరస్కరించింది. ఇప్పుడు.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జేడీయూ పక్క చూపులు చూపస్తోంది. దీంతో.. మూడు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి కూల్ చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించుకున్నారు. దీని కోసం ముహుర్తం రెడీ చేసుకుంటున్నారు.
మంత్రివర్గ విస్తరణ కసరత్తు అంటూ జరిగితే.. కొన్ని ఇతర సమీకరణాలను కూడా.. బీజేపీ పెద్దలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సహజంగా ప్రతీ రాష్ట్రానికి ఓ కేంద్రమంత్రి ఉండేలా చూసుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఆ అవకాశం దక్కింది. కానీ ఏపీకి మాత్రం.. కేంద్రమంత్రి లేకుండా పోయారు. బీజేపీ తరపున ఏపీ నుంచి ఎంపీలు ఎవరూ లేరు. సాంకేతికంగా ఏపీ నుంచి సురేష్ ప్రభు ఎంపీగా ఉన్నారు. కానీ ఆయనకు పదవి ఇవ్వలేదు. అయితే.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్ మాత్రం రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి కేంద్రమంత్రి పదవి ఇస్తారని.. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. సుజనా చౌదరి పేరే అందులో ప్రధానంగా వినిపిస్తోంది. కానీ బీజేపీ హైకమాండ్ నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు రాలేదు.
వైసీపీ నేతలు.. ప్రభుత్వంలో చేరే అవకాశం లేదు. శివసేన బయటకు వెళ్లిపోయిన తర్వాత.. ఎన్డీఏను బలోపేతం చేసుకోవడానికి… వైసీపీని… ఎన్డీఏలోకి అమిత్ షా ఆహ్వానించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. బీజేపీ పెద్దలు అలాంటి ఆహ్వానాలేమీ పంపలేదని… జగన్కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వెనక్కి పంపుతున్న వ్యవహారంతోనే తేలిపోయిందంటున్నారు.