” ప్రధానమంత్రిగా ఎల్లయ్య ఉండనీ..పుల్లయ్య ఉండనీ మనకు కావాల్సిన ప్రత్యేకహోదా ఇస్తామని రాసి ఇస్తేనే మద్దతు ఇస్తాం ” అని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రకటించారు. సీఎం అయ్యి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు కేంద్రానికి మన అవసరం లేదని అందుకే ప్రత్యేకహోదా రావడం లేదని.. అంత మాత్రాన అడగకూడదని ఎక్కడా లేదని ఆయన .. కేంద్రానికి మన అవసరం వచ్చినప్పుడు హోదా షరతు పెట్టి సాధిస్తామన్నారు. ఇప్పుడు ఆ చాన్స్ వచ్చిందనేది కళ్లముందు కనిపిస్తున్న విషయం.
వైఎస్ఆర్సీపీ బలం ఇప్పుడు బీజేపీకి అత్యవసరం అయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీనే కీలకమని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఎన్డిఎ రాష్ట్రపతి అభ్యర్థి గెలవాలంటే ఇంకా 20వేల ఓట్లు అవసరం. జెడియు యు టర్న్ తీసుకుంటే ఎన్డిఎ అభ్యర్థి విజయం మరింత కష్టం అవుతుంది. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్కు దాదాపు 45,885 విలువైన ఓట్లు వుండటంతో బిజెపికి జగన్మోహన్రెడ్డి మద్దతు కచ్చితంగా అవసరం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతోందనేది ఆసక్తిగా చూస్తున్నారు.
ఇప్పటి వరకూ కేంద్రానికి.. కేంద్రం బిల్లలకు వైఎస్ఆర్సీపీ ఎన్నో సార్లు మద్దతిచ్చింది. వ్యవసాయ బిల్లులకు, సీఏఏ ఎన్నార్సీ బిల్లలకూ మద్దతిచ్చింది. చెప్పాలని చూస్తే ఏ ఒక్క దాన్నీ వ్యతిరేకించలేదు. అయితే అప్పట్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ంఎలాంటి షరతులు పెట్టలేదు. రాజకీయ ప్రయోజనాలు మాత్రం నెరవేర్చుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం షరతులు పెట్టాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రత్యేకహోదా, పోలవరం సహా ఏ ఒక్క హామీ నెరవేరడం లేదు. వీటి కోసం పట్టుబట్టి సాధించకపోతే .. కుట్ర రాజకీయాల కోసం బీజేపీకి మద్దతిస్తే రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసినట్లేనన్న విమర్శలను జగన్ ఎదుర్కోక తప్పదు.