రాయలసీమ, నెల్లూరు వరద బాధితులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన వారు ఇప్పుడు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అంటున్నారు. గతంలో విపత్తులు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ విరుచుకుపడేవారు. చంద్రబాబు ఇచ్చే పరిహారం వారికి సరిపోదని ఇంకా ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు ఆయన తనకు ఏకపక్షంగా ఓట్లేసినా ప్రజలకు ఎంత సాయం చేస్తారన్న చర్చ ప్రారంభమయింది.
హుదూద్, తీత్లీ సమయాల్లో తక్షణం బాధితులకు నగదు సాయం ..!
గతంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో హుదూద్, ఉత్తరాంధ్రను తీత్లీ తుపాను వంటివి తీవ్ర నష్టం కలిగించాయి. ఇతర చోట్ల కూడాతుపానులు వచ్చాయి. అయితే ఎప్పుడు తీవ్ర నష్టం జరిగినా ప్రభుత్వం తక్షణం స్పందించేది. విశాఖలో హుదూద్ నష్టం జరిగినప్పుడు.. ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా చూసుకుంది. నష్టపోయిన వారందరినీ ఆదుకునే ప్రయత్నం చేసింది. జీవనోపాధి అయిన చెట్లను కోల్పోయినా ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. ఇక తిత్లీ విషయంలో ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. అందరికీ పరిహారాన్ని ఇచ్చింది. కొబ్బరి చెట్లకు కూడా ఆ యజమానాలకు డబ్బులు ఇచ్చింది.
అప్పట్లో ప్రభుత్వ సాయం చాలా తక్కువని జగన్ విమర్శలు !
అయితే హుదూద్, తిత్లీ సమయాల్లో ప్రభుత్వం ఇచ్చిన పరిహారం చాలా తక్కుని జగన్మహోన్ రెడ్డి విమర్శలు చేసేవారు. తిత్లీ తుపాను బాధితులందరికీ తాము రాగానే రెట్టింపు సాయం చేస్తామని ప్రకటించారు. అదంతా నిజమేననని అనుకున్నారు. ఎన్నికలు ముగిసిపోయాయి. కానీ ఇంత వరకూ ఎలాంటి సాయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి తిత్లీ బాధితులకు అందలేదు. అప్పటి ప్రభుత్వం అనర్హులకు నష్టపరిహారం ఇచ్చిందని విచారణ చేస్తున్నామని .. చాలా మాటలు చెప్పారు. ఎంత కాలం విచారణ చేస్తారో తెలియదు. ఇటీవలే నివేదిక సిద్దం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. కానీ పరిహారం మాత్రం ప్రకటించలేదు. పైగా గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని పరిహార చెక్కుల్ని కూడా బ్యాంకులో వేసుకుంటే చెల్లించవద్దని చెప్పడంతో వారికీ రూపాయి దక్కలేదు.
సీమ ప్రజలనైనా జగన్ ఆదుకుంటారా ?
ఇప్పటి వరకు జగన్ సీఎం అయిన తర్వాత పలు విపత్తులు వచ్చాయి. కానీ దేనికి ఆయన ప్రజలకు పరిహారం ప్రకటించలేదు. గులాబ్ తుపాను కారణంగా కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినప్పుడు ఇటీవల ఇన్పుట్ సబ్సిడీ పేరుతో రూ. 22 కోట్ల పరిహారం మాత్రమే ప్రకటించి.. తాము సరికొత్త సంప్రదాయాలను ప్రారంభించామని జగన్ చెప్పుకున్నారు. ఇప్పుడు సీమ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వరద బాధితులు జీవితాలనే కోల్పోయారు. ఇప్పటి వరకూ జగన్ చనిపోయిన వారికి రూ. ఐదు లక్షలు.. పునరావాస కేంద్రాల్లోకి వారికి రూ. రెండు వేలు ఇవ్వాలని ప్రకటించారు. ఇక సర్వం కోల్పోయిన వారికి ఇంత వరకూ ఎలాంటి సాయం ప్రకటించలేదు. కొన్ని వేల పాడి పశువులు కొట్టుకుపోయాయి. ఇళ్లు సహా మొత్తం కొట్టుకుపోయాయి. వారిని సీఎం జగన్ ఎలా ఆదుకుంటారో తేలాల్సి ఉంది.