ఏడాదిన్నర కిందట అమ్మఒడి సభలో సీఎం జగన్ ఓ ల్యాప్ ట్యాప్ ప్రదర్శించారు. కన్ఫిగరేషన్స్ కూడా చెప్పారు. బయట మార్కెట్లో ముఫ్పై వేలకు పైగా ఉండే ల్యాప్ ట్యాప్ అమ్మఒడి పథకం కింద ఇస్తామని ప్రకటించారు. అది జరిగి ఏడాదిన్నర అయింది. మళ్లీ అమ్మఒడి ఇస్తున్నారు కానీ ల్యాప్ ట్యాప్‌ల ఊసేలేదు. అసలు ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. నిజానికి ఎనిమిది నుంచి పదో తరగతి వరకూ చదువుకునే విద్యార్థుల ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి అంగీకాపత్రాలు తీసుకున్నారు. ఇక ల్యాప్ ట్యాప్ ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు.
ఈ ఏడాది ల్యాప్‌ట్యాప్‌లు లేవని స్పష్టమయింది. మరి వచ్చే ఏడాది ఇస్తారా అంటే.. ల్యాప్ ట్యాప్ కు బదులుగా బైజూస్ ట్యాప్ ఇచ్చే చాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. పిల్లలకు ల్యాప్ ట్యాప్ చదువుకోవడానికే కాబట్టి… పూర్తి స్థాయిలో చదువుతో కూడిన ప్యాకేజీ ఇచ్చే బైజూస్ ట్యాబ్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని.. అదే ల్యాప్ ట్యాప్ అనుకోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల ప్రభుత్వం హడావుడిగా బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. నాలుగున్నర లక్షల మందికిపైగా ఉన్న ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. ల్యాప్ ట్యాప్‌లు కూడా ఈ కేటగరీ విద్యార్థులకే ఇస్తామన్నారు.
అమ్మఒడి ఇప్పటికే చిక్కి పోతోంది. ఒక్కో విద్యార్థికి రూ. పదిహేను వేల నుంచి .. ఎంత మంది పిల్లలు ఉన్న ఒక్క తల్లికే ఇస్తామని మెలికపెట్టారు. ఇచ్చే మొత్తం కూడా పదిహేను వేల నుంచి పదమూడు వేలకు తగ్గించారు. లబ్దిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గిస్తున్నారు. ముందు ముందు ఈపథకం ఏ రూపం తీసుకుంటుందో అంచనా వేయడం కష్టంగా మారింది. ప్రభుత్వం ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూస్తే.. వచ్చే ఏడాది బైజూస్ ట్యాబే .. ల్యాప్ ట్యాప్గా అనుకోవాలని చెప్పనుందన్న అంచనాకు రావొచ్చంటున్నారు.