ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పై దాడి జరిగితే కోర్టుకు వెళ్లి మరీ ఎన్ఐఏ విచారణ తెచ్చుకున్నారు. ఐదేళ్ల తర్వాత తాము అనుకున్నట్లుగా విచారణ చేయలేదని ఆ ఎన్ఐఏపైనే నిందలు వేస్తున్నారు అది వేరే సంగతి. మరి ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న జగన్ పై రాయి పడింది. దాడికి ముందు కనీస భద్రతా చర్యలు లేవు. రాయి ఎక్కడి నుంచి వచ్చిందో చూడలేదు. ఎలా దాడి చేశారో పట్టించుకోలేదు. అసలు కేసు నమోదు చేశారో లేదో కూడా బయటకు రాలేదు. ఇంత తేడాగా ఉన్నప్పుడు ఎందుకు ఎన్ఐఏ విచారణకు డిమాండ్ చేయడం లేదు .
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై రాయి వేయడం అంటే చిన్న విషయం కాదు. సీఎం ప దవిలో వ్యక్తి ఉండవచ్చు కానీ.. ఆయన వెనుక ఓ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థపై దాడి చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా సీరియస్ గా తీసుకోవాలి. అందులో ఉన్న భద్రతా లోపాల దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ లోతైన దర్యాప్తు చేయాలి. ఆ సామర్థ్యం రాష్ట్ర పోలీసులకు లేదని.. సీఎం ఏర్పాటు చేసుకున్న భద్రతా వ్యవస్థకు లేదని తేలిపోయింది. రాయి వేసిన వాళ్లెవరో కనీసం గుర్తించేందుకు ప్రయత్నించలేదు.
జగన్ వస్తున్న సమయలో జనాల్ని సాక్షి మీడియాతో పాటు చాలా వరకూ వీడియోలు తీశాయి. జగన్ రాయి పడిన సమయంలో వందల మంది లేరు. ఓ ఇరవై , ముఫ్పై మంది ఉంటారు. ఆ కొద్ది మందిని అందర్నీ అదుపులోకి తీసుకుని ఉంటే… ఎవరు రాయి వేశారో.. ఎందుకు రాయి వేశారో తేలిపోయేది. కానీ ఆ దిశగా ఆలోచించలేదు. అంటే వ్యవస్థ అచేతనం అయిందని అర్థం . దీని వెనుక ఉన్న కుట్రను బయట పెట్టాలంటే ఖచ్చితంగా .. సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ జరగాల్సిందే. మరి బాధితుడు అయిన జగన్ .. ఆయన పార్టీ ఈ డిమాండ్ చేయడానికి ముందుకు వస్తుందా ? అన్నదే అసలు సందేహం.