ఇప్పుడు అందరూ కరోనా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ వైరస్ సోకుతుందా లేదా.. అన్నదాని గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా.. చితికిపోతున్న సామాన్య, మధ్య, దిగువ మధ్యతరగతి, పేద ప్రజల గురించి ఒక్కరంటే.. ఒక్కరూ మాట్లాడటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల రేషన్ ముందస్తుగా తీసుకోవచ్చని ప్రకటించింది కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమాచారమూ లేదు. అయితే దేశంలో ఒక్క రాష్ట్రం కేరళ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రజలందరూ ఎక్కడివక్కడ కార్యకలాపాలు స్తంభించిపోయి ప్రజలు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఏర్పడటంతో.. అందర్నీ ఆదుకోవాలని నిర్ణయించుకుంది. వారికి తక్షణ ఆర్థిక సాయంతో పాటు.. నిత్యావసరాలు ఉచితంగా అందించే సన్నాహాలు కూడా ప్రారంభించేసింది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ప్రతిపక్షాల నేతలను పిలిచి.. వారితో సంప్రదింపులు జరిపి.. ప్రజలకు ఎలాంటి సాయం చేయాలో.. నిర్ణయం తీసుకుని.. ప్రతిపక్ష నేతలందరితో కలిసి మీడియా ముందు కూర్చుని సాయం వివరాలు ప్రకటించారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ. వెయ్యి ఆర్థిక సాయంతో పాటు.. ఎలాంటి రేషన్ కార్డులున్నప్పటికీ… ఓ నెల ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. అలాగే.. ఉచిత భోజన కేంద్రాలను రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేయనున్నారు. వాటితో పాటు.. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో.. రూ. 20తే ఙోడనాసు అందించే ఏర్పాట్లు కూడా.. ఏప్రిల్ ఫస్ట్ నుంచే ప్రారంభిస్తున్నారు. మొత్తంగా ప్రజలను ఆదుకునేందుకు రూ. 20వేల కోట్లను కేరళ ప్రభుత్వం బడ్జెట్‌గా పెట్టుకుంది. దీంతో కేరళ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ రకాల వ్యాపార వ్యవహారాలను మూసివేయడంతో.. చిరు వ్యాపారులు సహా.. చాలా మంది ఉపాధి దెబ్బతిన్నది. క్యాబ్ డ్రైవర్ల దగ్గర్నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
రోజు కూలీలకు ఉపాధి గగనం అయింది. ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంది. సంక్షేమంలో చాంపియన్లమని చెప్పుకునే సర్కార్లు ఇంత వరకూ స్పందించలేదు. ప్రతీ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు కింద రూ.5వేలు.. రెండు నెలల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్.. ప్రభుత్వానికి లేఖ రాశారు. సాధారణ ప్రజలు జీవనోపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతున్నాయని.. పేద ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఎవరు కోరినా కోరకపోయినా…కరోనా నుంచి ప్రజల్ని రక్షించడమే కాదు.. వారిని ఆకలి దప్పికలను తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీదే ఉంది.