నూతన రాజధాని అమరావతిలో భాగంగా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం తలపెట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అటు భవన నిర్మాణంలోనూ ఇటు ఉద్యోగుల తరలింపులోనూ కూడా తడబాటుకు గురవుతున్నది.. విజయవాడ గుంటూరు అందుబాటులో వున్నా తాత్కాలికం కోసం వెలగపూడిలో 210 కోట్లతో వీటిని తలపెట్టారు. తర్వాత కూడా వాడుకోవడానికి వీలుగా కడుతున్నామన్నారు. జి+3తో ఈ దశ అయిపోతుందన్నారు. అందులో దిగువ రెండు ఫ్లోర్లు ఉద్యోగులకు పై రెండు ఫ్లోర్లు శాఖాధిపతులకు కేటాయించాలనుకున్నారు. జూన్చివరకు వీటిలోచేరితే ఆగష్టునాటికి తక్కిన రెండు ఫ్లోర్లు ఇచ్చేస్తారని భావించారు. కాని ఏదీ అనుకున్నట్టు జరగలేదు. కడుతున్న కాంట్రాక్టర్ల్లు అంటే ఎల్అండ్ టి , షాపూర్జీ వాలా సంస్థలు మొదట అనుకున్నట్టు గాక అదనంగా మరో రెండు ఫ్లోర్లు వేసేందుకు అంగీకరించలేదు. ప్రభుత్వం కూడా అనుకున్న ప్రకారం హడ్కొనుంచి రుణం 500 కోట్లు తెచ్చుకోలేకపోయింది. కారణం మరింత విచిత్రమైంది. నిర్మాణం జరుగుతున్న భూమిపై ప్రభుత్వానికి ఏ హక్కు లేదు. అది రైతుల నుంచి తీసుకోవడం తప్ప చట్టబద్దంగా రిజిస్ట్రేషన్ జరగలేదు. కనుకనే స్వంతహక్కులేని భూమిపై రుణం లభించడం కష్టమైంది.
మరో రెండు ఫ్లోర్లు కడితే అదనంగా పదిశాతం ఇస్తామని క్రిడా ఆశచూపినా వారు సిద్ధం కావడం లేదు. వేరే కాంట్రాక్టర్లను పిలవాలంటే ఇప్పటికే అధిక రేటు ఇస్తున్నాము గనక ఇంకా పెంచడం మంచిది కాదని అధికారులు సలహా ఇచ్చారట. దాంతో అద్దె భవనాలు వెతకమని పురమాయించారు. రాకపోకల సదుపాయాలు సరిగాలేనప్పుడు ఒకో కార్యాలయం ఒకచోటైతే ఎలా అని అధికారులు తలలుపట్టుకున్నారు. ప్రధాన కట్టడం పూర్తయ్యాక ఇతర సదుపాయలు ఫర్నిషింగ్, కనెక్షన్లు వంటివన్నీ ఇతరులకు ఇస్తే ఇబ్బంది గనక మళ్లీ ఇదే సంస్థలకు ఇవ్వకతప్పదు.
ఈ నేపథ్యంలోనే జూన్27కు ఉద్యోగులను తరలించాలని చంద్రబాబు నాయుడు ఒకటికి రెండు సార్లు గట్టిగా ప్రకటించినా, వాస్తవ పరిస్థితి ఇంత దారుణంగా వుంది గనకన్ణే కాస్త వెనక్కు తగ్గారు. జూన్27తో మొదలుపెట్టి దశలవారీగా తీసుకెళ్తామన్నారు. మరి ఈ కొత్త గజిబిజి తర్వాత తమ పిల్లలను ఎక్కడ చేర్చాలన్నదిఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్న సమస్య. విద్యా సంవత్సరం మధ్యలో నిర్ణయం తీసుకుంటే అది మరో తలనొప్పి..అద్దెలు ప్రయాణ భారాలు సరేసరి. భార్యా భర్తలు ఎవరెక్కడ అనే సమస్యా వుంది. అసలు కార్యాలయ భవనమే సిద్దం కానప్పుడు పాలనను తరలించడం,ఒత్తిడి తేవడం ఎందుకుని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి సంకేతాలు చూసి కొందరు ఉద్యోగ నాయకులు కూడా అప్పుడే వెళ్లే అవసరం వుండదని భరోసాగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఎలా తరలివెళ్లాలనేది సమగ్రంగా స్పష్టంగా ప్రకటించేంత వరకూ ఈ గండరగోళం తొలగదు.
ఈ కొద్దిమాసాల్లోనే ప్రమాదాలు కష్టనష్టాలు అనేకం వచ్చాయి. కార్మికులు మరణించారు. భద్రత కోసం సరైన జీతాల కోసం కార్మికులు నిరసన తెలిపితే ఆంక్షలు విధించారు.ముఖ్యమంత్రి ప్రయాణించే బస్సు కూడా కూరుకుపోయిన విపరీత పరిస్థితి. ఇవన్నీ విభజన ఫలితమని ముఖ్యమంత్రి ఆగ్రహావేదనలు వ్యక్తం చేస్తుంటారు. కళ్లముందు వందల ఫ్లాట్ల బహుళ అంతస్తులు రియ్లల్టర్లే కట్టేస్తుంటే ప్రభుత్వానికి దాని హైటెక్ అధినేతకు ఇంత అయోమయం ఏర్పడ్డం అంతుపట్టని విషయం!