తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మాదిరి ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరించేందుకు కూటమి సర్కార్ కూడా శ్వేతపత్రం ప్రవేశపెట్టనుందా..? కొత్త ప్రభుత్వం వైసీపీ హాయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం లెక్క తేల్చే పనిలో పడిందా..? అంటే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై పూర్తి పట్టున్న మాజీ మంత్రి యనమనుల రామకృష్ణుడితో తాజాగా భేటీ కావడంతో ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి.
జగన్ రెడ్డి ముందుచూపు లేని నిర్ణయాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పులమీద నడిపించే పరిస్థితికి నెట్టడంతో కొత్త ప్రభుత్వానికి సవాళ్లు ఎదురు అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించాలని కూటమి ప్రభుత్వం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రానికి అప్పు ఎంత ఉంది.? ఏయే కార్పోరేషన్ల ద్వారా గత ప్రభుత్వం ఎంత అప్పు చేసింది..? ఆ నిధులను ఏ అవసరాల కోసం వినియోగించారు..? అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించారు..? ఎంత ఖర్చు చేశారు..? అనే అంశాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతి శాఖ నుంచి ఆర్థిక శాఖ అధికారులు నివేదిక కోరినట్లుగా టాక్ నడుస్తోంది.
గతంలో ఆర్థిక మంత్రిగా సేవలందించిన యనమల రామకృష్ణుడిని ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ విడుదల చేసే ఆలోచనలో ఉండటంతోనే యనమలతో పయ్యావుల భేటీ అయ్యారని…ఈ విషయంలో ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నారని చెబుతున్నారు.