ప్రజా పోరాటాలు చేస్తే ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బంది అవుతుదో అని ఇంత కాలం మొహమాట పడిన బీజేపీ నేతలు ఇప్పుడు స్టాండ్ మార్చుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి సారిగా విజయవాడలో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టి విజయవంతం చేయాలని అనుకుంటున్నారు. అమరావతి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, కేంద్ర నిధులను దారిమళ్లించడం వంటి అంశాలపై జగన్ సర్కార్‌పై విరుచుకుపడే యోచనలో బీజేపీ ఉంది.
అయితే సామూహిక కార్యక్రమాలు వద్దని అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల కిందటే అత్యవసరంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వివరించారు. మోడీ ప్రసంగం తర్వాత తెలంగాణ సర్కార్ కూడా రాజకీయ పరమైన కార్యక్రమాలపై ఆంక్షలు విధంచింది. దీంతో బండి సంజయ్ చేయాలనుకున్న నిరుద్యోగ దీక్షను కూడా బహిరంగ కార్యక్రమంలాగా కాకుండా.. పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏపీ అధికారులు బీజేపీ సభ విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
బహిరంగసభలకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు బీజేపీ నేతలకు సమాచారం పంపితే అది వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. ప్రధాని సూచనల మేరకే ఆంక్షలు విధిస్తున్నామని పోలీసులు చెబితే బీజేపీ నేతలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పోలీసుల విషయంలో ఇప్పటికే కేంద్రం సీరియస్‌గా ఉందని.. అందరి చిట్టాలు తెప్పిస్తున్నామని త్వరలోనే కొంత మందిపై చర్యలు ఉంటాయని సీఎం రమేష్ చేసిన హెచ్చరిక ఐపీఎస్ వర్గాల్లో సంచలనం రేపింది. ఈ కారణంగా బీజేపీ విషయంలో చూసీ చూడనట్లుగా ఉంటేనే బెటరన్న అభిప్రాయం కూడా ఆ వర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీ సభ సజావుగా సాగనిస్తే పోలీసుల తీరులో కాస్త మార్పు వచ్చినట్లే భావించాలని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.