శనివారం అంతా సోషల్ మీడియాలో రెండే అంశాలు హైలెట్ అయ్యాయి. ఒకటి రేణిగుంటలో ఓ మహిళా సీఐ .. మరో మహిళను బట్టలూడిపోతున్నా సరే బలవంతంగా .. రాత్రి పదిన్నర తర్వాతస్టేషన్కు తరలించారు. ఆమెచేసిన నేరం ఏమిటంటే.. హోటల్‌ను పది గంటల తర్వాత తెరిచి ఉండటం. ఏపీలో అది.. బట్టలూడదీసి మరీ అర్థరాత్రి ఓ మహిళను స్టేషన్‌కు తీసుకెళ్లేంత నేరమా ? ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఏపీ పోలీసులు అలా చేయకపోతేనే ఆశ్చర్యం అన్న స్టాండర్డ్‌ను ఎప్పుడో సాధించారు. ఆ పోలీసు అధికారిణి గత చరిత్ర అంతా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. సొంత డిపార్టుమెంట్‌కు చెందిన వారినే బండ బూతులు తిడుతున్న వీడియో దగ్గర్నుంచి గతంలో ఆమె అసువుగా అందరి మీద చేయి చేసుకుంటున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇంత ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసే అధికారిణి డిపార్టుమెంట్లో ఉండటం.. ఆమెను ప్రోత్సహించడంలో ఆశ్చర్యమేమీ లేదని అందరూ అనుకున్నారు. ఈమె వ్యవహారంపై చర్చ జరుగుతూండగానే హైదరాబాద్‌లో సీఐడీ పోలీసులు చింతకాయల విజయ్ ఇంట్లో చేసిన రచ్చ హాట్ టాపిక్ అయింది. నోటీసులు ఇవ్వడానికి పది మందితో సీఐడీ పోలీసులు వెళ్తారా ? ఇంట్లోకి చొరబడతారా ? డ్రైవర్ని.. పని మనిషిని.. ఇంకా చింతకాయల విజయ్ ఐదేళ్ల పిల్లని కూడా భయపెడతారా? ఇదా పోలీసింగ్ ?. చిన్న పిల్లపైనా ఏపీ సీఐడీ పోలీసులు ప్రతాపం చూపారని బయటకు తెలిసిన తరవాత చాలా మందిలో భయం కలుగుతుంది.
అంత పెద్ద టీడీపీ లీడర్ ఇంటిపైనే దాడి చేస్తే.. రేపు ఇదే పద్దతిలో మా ఇంట్లో దోపిడీలు చేయడానికి రారన్న గ్యారంటీ ఏముందని చాలా మంది భయపడతారు. వారి భయంలో నిజాయితీ ఉంటుంది. ఎందుకంటే సీఐడీ పోలీసులు చేసింది అలాంటిదే. ఈ రెండు ఘటనలు ఒక్క రోజు జరిగినవే. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిపోయిందో తెలిపేందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇక ఏపీ ప్రజలకు ఎక్కడైనా రక్షణ లభిస్తుందని ఆశపడితే అది పొరపాటే. ప్రజలంతా ఎవరి రక్షణ వారు చూసుకోవాలి. అది దొంగల నుంచో.. దోపిడి దారుల నుంచో.. మరొకరి నుంచో కాదు.. పోలీసుల నుంచే తమను తాము ప్రజలు కాపాడుకోవాలి. నేరస్తులు మాత్రం నిబ్బంరంగా ఉండొచ్చు.