హైదరాబాద్: రాజ్‌భవన్‌లో ఈనెల 10వ తేదీన ఇచ్చే ఇఫ్తార్ విందుకు గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఆహ్వానించారు. ఓటుకు నోటు, సెక్షన్ 8 వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పాలకుల మధ్య వాతావరణం వేడివేడిగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈ విందుకు హాజరవుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ ఇటీవల రాజ్‌భవన్‌లో ఇచ్చిన విందుకు చంద్రబాబు హాజరైనప్పటికీ, కేసీఆర్ మాత్రం జ్వరంసాకుతో ఎగ్గొట్టారు. సీఎమ్ జ్వరంతో బాధపడుతున్నట్లు ఉదయంనుంచే మీడియాకు లీకులు వదిలారు. చంద్రబాబుకు ఎదురుపడటం ఇష్టంలేకే ఆయన విందుకు గైర్హాజరయ్యారన్న వాదన ఆ రోజు బాగా వినిపించింది. మరి వచ్చే శుక్రవారం రాజ్‌భవన్‌లోనే జరగబోయే విందుకు ఇరువురు చంద్రులూ హాజరవుతారా, హాజరైతే మాట్లాడుకుంటారా అనేది తెలియటంలేదు. గత సంవత్సరం గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరుకాగా, కేసీఆర్ హాజరుకాలేదు. నాటి విందుకు జగన్, జానారెడ్డి, నాయని తదితరులు హాజరయ్యారు.