ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1. మంత్రివర్గ విస్తరణ/ప్రక్షాళన. 2. మూడు రాజ్యసభ సీట్ల భర్తీ.
మంత్రి పదవులు, రాజ్యసభ సీట్ల కోసం పార్టీలో చాలా మంది పోటీ పడుతుండటంతో రెండూ కూడా చాలా క్లిష్టమయిన సమస్యలగానే మారాయి. రెంటి భర్తీకి ఎంత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకొన్నప్పటికీ, అందరినీ సంతృప్తిపరచడం ఎవరి వల్లా కాదు కనుక పదవులు ఆశించి భంగపడినవారు అసంతృప్తి చెందడం సహజం. మళ్ళీ అది చల్లారడానికి చాలా సమయం పడుతుంది. చంద్రబాబు నాయుడే స్వయంగా మంత్రివర్గ విస్తరణ అనే ఈ తేనె తుట్టెని కదిపారు కనుక దానికి పరిష్కారం చూపవలసిన బాధ్యత కూడా ఆయనదే. అందుకోసం ఆయన గత కొన్ని రోజులుగా చాలా కష్టపడుతున్నారు పాపం. అయినా అందరికీ ఆమోదయోగ్యంగా ఈ సమస్యని పరిష్కరించడం అసాధ్యం.
పాపం ఆయన బాధ చూడలేక చివరికి ఆయనని తీవ్రంగా వ్యతిరేకించే సాక్షి మీడియా ఈ సమస్యకు చిన్న పరిష్కారం చెప్పింది. అయితే నేరుగా చెపితే దాని వలన వైకాపాకి ఎటువంటి లాభమూ ఉండదు కనుక తన పద్దతిలోనే చంద్రబాబు నాయుడు ఈవిధంగా ఒకేసారి బాలకృష్ణకి హరికృష్ణకి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చింది.
ఇంతకీ సాక్షి మీడియా ఏమి చెప్పిందంటే, బాలకృష్ణకి మంత్రి పదవి ఇస్తే ఆయన ఒక సమాంతర రాజకీయ శక్తిగా తయారయ్యి, చంద్రబాబు నాయుడుకి సవాలు విసిరే ప్రమాదం ఉంది. కనుక ఆయనకి చెక్ పెట్టేందుకే నారా లోకేష్ కి మంత్రి పదవి ఇవ్వాలని తన మంత్రుల ద్వారా మీడియాకి గట్టిగా చెప్పించారు. అలాగని ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆయన వలన సమస్యలు రావచ్చును. కనుక అయనని రాజ్యసభకి పంపించినట్లయితే ఆయన వలన సమస్య రాకుండా తప్పించుకోవచ్చును.
ఆవిధంగా చేసినట్లయితే రాజ్యసభ సీటు ఆశిస్తున్న నందమూరి హరికృష్ణకి చెక్ పెట్టవచ్చును. నారా లోకేష్ ని మంత్రి వర్గంలోకి తీసుకొంటే ఆరు నెలలలోగా శాసనసభ లేదా మండలి సభ్యుడిగా ఎన్నిక కావలసి ఉంటుంది. కనుక బాలకృష్ణని రాజ్యసభకి పంపి, ఆయన ఖాళీ చేసే హిందూపురం నియోజకవర్గం నుంచి లోకేష్ ని పోటీ చేయించవచ్చును. ఈవిధంగా ఒకేసారి నందమూరి సోదరులు ఇద్దరికి చెక్ పెట్టేయవచ్చునని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు సాక్షి మీడియా ఊహించి చెప్పింది.
చంద్రబాబు నాయుడుకి నిజంగా ఈ ఆలోచన వచ్చిందో లేదో కానీ సాక్షి సూచిస్తున్న ఈ ఐడియాని ట్రై చేయవచ్చును. సాక్షి మీడియా ఇలాగే మిగిలిన సమస్యలకి కూడా మంచి పరిష్కారం చూపితే చంద్రబాబు నాయుడుకి ఎంతో మేలు చేసిందవుతుంది కదా!