జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలో చేరేందుకు ప్రయత్నించారని ఇటీవల ప్రచారం జరిగింది. ఆయన ఈ ప్రయత్నాలు చేశారో లేదో కానీ, బాలినేనికి జగన్ వద్ద ప్రాధాన్యత తగ్గడం..వైసీపీ అధికారం కోల్పోవడం.. పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారానికి బలం చేకూరినట్లు అయింది.
జనసేనలో చేరేందుకు ప్రయత్నించినప్పటికీ బాలినేనిపైనున్న ఆరోపణలతో డోర్స్ క్లోజ్ అయ్యాయన్న టాక్ వినిపించింది. అయితే, ఎన్నికల తర్వాత మొదటిసారి ఒంగోలుకు వస్తోన్న బాలినేని ఎలాంటి ప్రకటన చేస్తారు అన్నది చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను చెవిరెడ్డికి అప్పగించాలనే అధిష్టానం నిర్ణయాన్ని బాలినేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్వపక్షంలో విపక్షంలా వ్యవహరించిన బాలినేనిని మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో నాడు జగన్ పక్కనపెట్టారు. ఈ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని జగన్ పై ఒత్తిడి తెచ్చినా నిరాకరించడంతో.. మాగుంట టీడీపీలో చేరి గెలుపొందారు. ఇవన్నీ తనకు పార్టీలో జరిగిన అవమానాలుగా ఫీల్ అవుతున్నారు బాలినేని.
ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతుండటంతో ఒంగోలులో తన రాజకీయ ప్రాధాన్యతను కాపాడుకోవాలని బాలినేని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వైసీపీలో తాను కోరుకున్న ప్రాధాన్యత లభించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే, పార్టీ మార్పుపై జనసేన నుంచి ఊహించని స్పందన వచ్చిందనే ప్రచారంతో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం లేకపోలేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీలో బలపడేందుకు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. మాజీ కాంగ్రెస్ నేతలను మళ్లీ పార్టీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా పలువురు మాజీ మంత్రులపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. బాలినేని కూడా ఈ జాబితాలో ఉండొచ్చునని అంటున్నారు. కానీ, ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.