ఎన్నికల ఫలితాలకు కొద్దిరోజులు ముందు, ఈవీఎం పనితీరు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయమైన సంగతి తెలిసిందే. ఈవీఎంలో లోపాలున్నాయనీ, బేలెట్ పేపర్ విధానంలోనే ఎన్నికలు జరపాలంటూ 23 ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. గడచిన ఎన్నికల్లో కనీసం 50 శాతం వీవీప్యాట్లనైనా లెక్కించాలనీ డిమాండ్ చేశాయి. అయితే, ఈ డిమాండ్ ను సర్వోన్న న్యాయస్థానం కూడా సమర్థించలేదు. ఆ తరువాత, ఎన్నికల ఫలితాలు రావడం, దేశవ్యాప్తంగా భాజపా మరోసారి విజయఢంకా మోగించడం జరిగిపోయింది. దీంతో, ఈవీఎంల పనితీరుపై ఓడిపోయిన పార్టీలేవీ మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడితే, అదిగో ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేసేవారే ఎక్కువగా ఉంటారు! కానీ, ఈ ఉద్యమాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
బేటెల్ విధానంలోనే ఎన్నికలు జరగాలంటూ మరోసారి డిమాండ్ చేశారు మమతా. ఈవీఎంల టేంపరింగ్ పై ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మెషీన్లను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలిగించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బేలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. బేలెట్ విధానంలో ఎన్నికలు జరిపేలా ఒక ఉద్యమాన్ని బెంగాల్ నుంచి ప్రారంభిస్తామన్నారు. దేశంలోని 23 విపక్ష పార్టీలతో తాను మాట్లాడతాననీ, ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆమె అన్నారు. గడచిన పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల పనితీరుపై చాలా అనుమానాలున్నాయని మమతా చెప్పారు.
నిజానికి, ఎన్నికల ఫలితాలు రాగానే ఈవీఎంలపై చర్చ పక్కకు వెళ్లింది. ఓడిపోయిన పార్టీలన్నీ దీనిపై మాట్లాడేందుకు కాస్త ఆలోచిస్తున్న పరిస్థితి. ఇప్పుడు, బేలెట్ బ్యాక్ ఉద్యమాన్ని బెంగాల్ నుంచే ప్రారంభిస్తామని మమతా అంటున్నారు. నిజానికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈవీఎంలలో లోపాలను వివరించేందుకు ఎన్నికల ముందు కొన్ని రాష్ట్రాల్లో పర్యటించారు. ఢిల్లీ స్థాయిలో ఆయనే చొరవ తీసుకుని ఈసీకి ఫిర్యాదులూ చేశారు. ఎన్నికలకు ముందు ఈ 23 పార్టీల మధ్య ఒకరకమైన ఐకమత్యం కనిపించింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీలన్నీ ఒకేతాటి మీదికి వచ్చి, ఉద్యమించే స్థాయి స్ఫూర్తి ఉంటుందా అనేదే ప్రశ్న?