తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర శనివారం ప్రారంభం కానుంది. దీని కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. 30 కమిటీలను ఏర్పాట్ల కోసం నియమించి అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. తొలి రోజు భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. నిజానికి బండి సంజయ్ పాదయాత్ర తొమ్మిదో తేదీన ప్రారంభం కావాలి..కానీ అప్పుడు కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత ఇరవై నాలుగున అనుకున్నారు. కానీ యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ చనిపోవడంతో వాయిదా పడింది. ఇక జరుగుతుందా లేదా అనుకుంటున్న దశలో వెంటనే తేదీని ఖరారు చేసుకున్నారు. శనివారం నుంచే ప్రారంభిస్తున్నారు.
మళ్లీ మీడియా సంస్థలను పిలిచి ఇంటర్యూలు ఇచ్చారు. తన పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్ర అని ఎందుకు పెట్టామో అన్న దగ్గర్నుంచి పాదయాత్రలో ప్రజలకు భరోసా ఇస్తామనే వరకూ చాలా మాటలు చెప్పారు. అయితే బండి సంజయ్ పాదయాత్ర నిరాటంకంగా సాగుతుందా అన్నదానిపై మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన కూడా దశలవారీగా పాదయాత్ర చేస్తానని వచ్చే ఏడాది వరకూ ఈపాదయాత్ర సాగుతుందని చెబుతున్నారు. మొదటి విడతగా పాదయాత్ర ఉపఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ నిర్వహిస్తారు. ఆ తర్వాత హుజురాబాద్ వెళ్తారు.
కానీ బీజేపీలో ఉన్న అంతర్గత రాజకీయాల కారణంగా బండిసంజయ్ పాదయాత్ర సాగడం కష్టమేనన్న అభిప్రాయాలు ఆపార్టీలోనే ఉన్నాయి. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. అనేక పనులు ఉంటాయి. వాటిని నిర్వహించడానికైనా తరచూ యాత్రకు బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. పాదయాత్రలో జనం పెద్దగా కనిపించకపోతే పార్టీ హైకమాండ్‌కు వెళ్లే ఫిర్యాదులు ఎక్కువగానే ఉంటాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకుని బండి సంజయ్ పాదయాత్ర చేయాల్సి ఉంది.