కేసీఆర్ అంటే.. ఇప్పటికీ ఓ ప్రాంతీయ పార్టీ నేతగానే జాతీయ మీడియా .. జాతీయ రాజకీయ పార్టీల నేతలు గుర్తిస్తున్నారు. టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్ర వాదనతో… రాష్ట్రాన్ని సాధించిన ఆయన ఇమేజ్ అంత త్వరగా మాసిపోయేది కాదు…అందుకే బీఆర్ఎస్ పార్టీ ద్వారా తనకు జాతీయ ఇమేజ్ తెచ్చుకునేందుకు పకడ్బందీ ప్రణాళికలు వేసుకున్నారు. ఖమ్మంలో అత్యంత భారీగా సభ నిర్వహించడమే కాకుండా.. అక్కడ తన కోసం జాతీయ నేతలు తరలి వచ్చారని చూపించుకోవడానికి పకడ్బందీ ప్రణాళికలు వేసుకున్నారు.
సీఎం కేసీఆర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కమ్యూనిస్టు జాతీయ స్థాయి నేతలను ప్రత్యేక విమానాల ద్వారా రప్పిస్తున్నారు. 100 మంది ప్రముఖుల కోసం హైదరాబాద్ లోని స్టార్ హోటళ్లలో వసతి ఏర్పాటు చేశారు. ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సీపీఎంకు చెందిన కేరళ సీఎం పినరయి విజయన్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా వంటి వారు రానున్నారు. కమ్యూనిస్టు పార్టీ నేతలకు కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే పార్టీ ప్రకటించినప్పటి నుండి కేసీఆర్ చేపడుతున్న ప్రతీ జాతీయ రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటున్న కుమారస్వామి ఈ సారి వస్తున్నారా లేదా అన్నదానిపై స్పష్టత లే్దు. ఆయన వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పంజాబ్ సీఎం రాకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
నేతలంతా బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమవుతారు. ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చిస్తారు. తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అక్కడి నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్లి.. లక్ష్మీ నర్సింహస్వామి దర్శనం చేసుకుంటారు. ఖమ్మం వెళ్లి కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. నలుగురు ముఖ్యమంత్రులు, అఖిలేశ్, డి.రాజా చేతులమీదుగా కంటివెలుగు రెండో విడతను ప్రారంభిస్తారు. లంచ్ తర్వాత బహిరంగ సభలో లీడర్లు పాల్గొంటారు. ఇంత మంది జాతీయ నేతలు వస్తున్నందున.. జాతీయ మీడియా సభకు ప్రాధాన్యం ఇస్తుందని అంచనా వేస్తున్నారు.