హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని ప్రముఖ నాయకుడు భూమా నాగిరెడ్డి వైసీపీనుంచి అధికార తెలుగుదేశంపార్టీలోకి చేరబోతున్నారంటూ వెలువడుతున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ ఇద్దరూ టీడీపీలోకి చేరబోతున్నట్లు చెబుతున్నారు. తనకు మంత్రిపదవి కూడా వస్తుందని భూమా అనుచరులతో చెప్పినట్లు కథనాలు బయటకొస్తున్నాయి. మరోవైపు ఇవాళ సాయంత్రం 3 గంటలకు భూమా తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయటంతో ఆయన, ఆయన కుమార్తె టీడీపీలో చేరిక ఊహాగానాలు దాదాపుగా నిజమయ్యేటట్లు కనిపిస్తున్నాయి. నాగిరెడ్డి ప్రస్తుతం పీఏసీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఇదిలాఉంటే భూమా, ఆయన కుమార్తెతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరతారని అంటున్నారు. నాగిరెడ్డి నంద్యాల నియోజకవర్గానికి, అఖిలప్రియ ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.