పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించినా తాము పోటీలో ఉంటామని భారతీయ జనతా పార్టీ, జనసేనలు ప్రకటించాయి. నిజానికి ఈ రెండు పార్టీలకు ఇప్పుడు ఇది గొప్ప అవకాశం. టీడీపీ ఓటు బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకోవడానికి వచ్చిన గోల్డెన్ చాన్స్. అయితే రాజకీయాల్లో అవకాశాలు రావడం ఎక్కువ.. కానీ ఆ ఆవకాశాలు వినియోగించుకునేవారే చాంపియన్లు అవుతారు. అవకాశాలు సృష్టించుకుని ఎదిగేవారు చాలా మంది ఉంటారు.. కానీ అవకాశం వచ్చినప్పుడు కూడా ఉపయోగించుకోని వాళ్లు ఉంటారు. ఇప్పుడు… బీజేపీ, జనసేనకు గొప్ప అవకాశం వచ్చింది. అందుకోవడానికి వారం చేయబోతున్నారన్నది ఇప్పుడు కీలకం. నామినేషన్ల ఉపసంహరణ ఇప్పటికే పూర్తయింది. అభ్యర్థులు ఫైనల్ అయ్యారు.
ఈ సమయంలో అభ్యర్థుల్లో ఎలాంటి మార్పుచేర్పులు ఉండవు. బీజేపీ, జనసేన తరపున బరిలో ఉన్న వారు పోరాడి… తమ సక్సెస్ రేట్‌ను మ్యాగ్జిమం చూపించుకుంటే… వారు సక్సెస్ అయినట్లుగానే భావించారు. కనీసం ఓ పది శాతం మండల పరిషత్‌లు… పది శాతం జడ్పిటీసీ స్థానాలు సంపాదించుకున్నా… టీడీపీ నిర్ణయం నుంచి వారు లబ్ది పొందినట్లుగా అవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకునేవారిని పోలింగ్ బూత్‌ల వరకూ తీసుకు వస్తే వారి పని సులువు అవుతుంది. అలా చేయాలంటే.. గ్రామస్థాయిలో క్యాడర్ ఉండాలి. బీజేపీ.. జనసేనకు అలాంటి వ్యవస్థ లేదు.
కానీ జనసేనకు మాత్రం… పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. వారిపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు కూటమి నేతలు. ప్రధాన ప్రతిపక్షం బహిష్కరణ పరిస్థితుల్లో …కనీసం తాము పోటీ ఇవ్వగమని నిరూపించగలిగితే… బీజేపీ-జనసేనకు భవిష్యత్ ఉంటుంది. లేకపోతే.. ప్రజలు అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని అనుకోవాల్సి వస్తుంది. సోము వీర్రాజులాంటి వాళ్లు… అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలు చేయకుండా .. టీడీపీ పారిపోయింది.. టీడీపీకి చేతకాలేదు అంటూ.. ప్రతిపక్షంపైనే విమర్శలు చేస్తూ…సమయం వృధా చేసుకుంటున్నారు. ఇలాంటి నేతలతోనే సమస్య వస్తోందని కూటమి కార్యకర్తలు గొణుక్కుంటున్నారు.