దేశంలో తిరుగులేని రాజకీయ పార్టీగా మారిన భారతీయ జనతా పార్టీ 2023 అత్యంత క్లిష్టమైన సవాల్ విసరబోతోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీజేపీ తన ప్రభావం తగ్గలేదని.. కమలం వాడిపోలేదని నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెమీ ఫైనల్స్ లాంటి ఎన్నికలు ఈ ఏడాదే జరగబోతున్నాయి. దీంతో ఆ పార్టీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతోంది. వ్యూహప్రతి వ్యూహాలు రెడీ చేసుకుంటోంది. రెండు రోజుల పా ఈ ఒక్క ఏడాదే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్నీ ఒకే సారి జరగడం లేదు. ఏడాది మొత్తం జరగనున్నాయి.
ప్రస్తుతం బీజేపీ అత్యంత బలంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ , తెలంగాణ పెద్ద రాష్ట్రాలు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్, చత్తీస్ ఘడ్‌లలో కాంగ్రెస్అధికారంలో ఉంది. ఇప్పుడు కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు కొత్త రాష్ట్రాలను చేజిక్కించుకోవాలి. పొరపాటున ఒక్క రాష్ట్రం కోల్పోయినా ఇబ్బందికరమే. తెలంగాణలో కూడా హాట్ ఫేవరేట్లుగా ఉన్నామని.. గెలిచి తీరుతామని అంటున్నారు. ఎక్కడ నిరాశజనక ఫలితాలొచ్చినా ఆ ఎఫెక్ట్ వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై పడుతుంది.
కేంద్రంలో బీజేపీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కమలనాథులు రాజకీయ ప్రణాళికలు రెడీ చేస్తుకుంటున్నారు. అది జరగాలంటే తొమ్మిది రాష్ట్రాల్లో గెలవాలి. అయితే పరిస్థితి అనుకున్నంత తేలిగ్గా లేదని.. బీజేపీ నేతలకూ తెలుసు. గుజరాత్లో ఏకపక్ష విజయం సాధించినా హిమాచల్ ప్రదేశ్ లో అధికారం చేజారింది. గతంలోలా మోదీ క్రేజ్ ఉందా అంటే.. ఉందని చెప్పలేని పరిస్థితి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సోషల్ మీడియా , మీడియా హైప్ ద్వారా.. క్రేజ్ ను నిలబెట్టడం ఇంకా ఎంతో కాలం సాధ్యం కాకపోవచ్చన్న అంచనాలున్నాయి. అందుకే ఈ ఏడాది గెలిస్తేనే వచ్చే ఏడాది బీజేపీకి శుభం.. లేకపోతే కష్టం .