బండి సంజయ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిన తర్వాత ఢిల్లీలోనూ కేంద్ర పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని బీజేపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి వివరాలు సేకరించారని చెప్పుకొచ్చారు. అర్ధరాత్రి పూట బండి సంజయ్ ని వందలాది మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారని దీనిపై మోడీ, అమిత్ షాలు ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు.
బండి సంజయ్ ను అరెస్ట్ చేసింది రాజకీయ కేసుల్లో కాదు. ఏదో ధర్నాకో.. ఆందోళనలకో వెళ్తూంటే అరెస్టులు చేయడం వేరు. అసలు జరగని పేపర్ లీకేజీ కేసులో కుట్ర దారు అంటూ అరెస్ట్ చేశారు. అసుల పేపర్ లీక్ అయిందని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం లేదు. పరీక్ష ప్రారంభమైన తర్వాత కొంత మంది ఉపాధ్యాయులే ఫోటోలు తీసి వాటిని బయటకు పంపుతున్నారు. మాల్ ప్రాక్టీస్ చేసేందుకు ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు , మీడియా అంతా లీకేజీ కేసు అంటున్నారు కానీ.. అది అధికారికంగా మాల్ ప్రాక్టీస్ కేసు. అయితే బండి సంజయ్ విషయంలో రాజకీయ కుట్ర లాంటి పదాలు వాడారు.
ఇది బీజేపీ ఆహం మీద దెబ్బకొట్టడమే. గతంలో ఫామ్ హౌస్ కేసులో ఇంత కన్నా దారుణంగా చేసినా బీజేపీ నేతలు ఏమీ చేయలేకపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పూర్తి స్థాయిలో ఆధారాలున్నాయని ప్రచారం చేసుకున్నా… ఇతర నిందితులందర్నీ అరెస్ట్ చేసినా కవితను మాత్రం అరెస్ట్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతల్ని మాత్రం బీఆర్ఎస్ వదిలి పెట్టడం లేదు. చాన్స్ వస్తే లోపలేసేస్తోంది. ఓ రకంగా బీజేపీ నిస్సహాయంగా కనిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టులు చేయగలిగే చాన్స్ ఉంది.. . ఎమ్మల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతికి వచ్చింది. అయినా బీజేపీ బాధితురాలిగానే ఉండటానికే ప్రయత్నిస్తోందంటే అది చేతకానితనం అనే అభిప్రాయం బలపడటానికి కారణం అవుతోంది.