భారతీయ జనతా పార్టీ… కేంద్రంలో ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న పార్టీ… 33 పార్టీలు సమర్థిస్తున్న పార్టీ. విజయవంతంగా మూడేళ్ళ పరిపాలనను పూర్తిచేసిన పార్టీ. ఉత్తర ప్రదేశ్‌లో అరివీరభయంకరమైన విజయాన్ని సాధించిన పార్టీ. ఈ ఘనతంతా ఒకే ఒక వ్యక్తిమీద ఆధార పడి సాధించింది. అదే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ. మోడీ ప్రతి ఇంటికీ చేరారనీ, ప్రతి మనసునూ కొల్లగొట్టారనీ.. దేశంలో అన్ని రంగాల అభివృద్ధికి అప్రతిహతంగా కృషి చేస్తున్నారనీ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. మరో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీదీ, ఏపీ బీజేపీ అధ్యక్షుడూ, విశాఖ ఎంపీ అయిన కంభపాటి హరిబాబుదీ ఇవే మాటలు. నరేంద్రమోడీని ప్రశంసల్లో ముంచెత్తడానికి వారు ఎన్నుకోని అంశం లేదు.. ప్రస్తావించని రంగం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం వేదికగా ఈ ప్రస్తుతావళి కొనసాగింది. బీజేపీ మూడేళ్ళ పరిపాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మోడీపై పొగడ్తల పెను వర్షాన్ని కురిపించారు. ఆంధ్ర ప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ అంశాలను కార్యకర్తలు సమర్థంగా రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెడితే ఏపీలో కూడా బీజేపీకి ఆదరాభిమానాలు పెరుగుతాయనీ, అందుకు అంతా నడుంబిగించాలని కోరారు.
ఇదంతా బాగానే ఉంది. ఏపీకి బీజేపీ ఎంతో చేస్తోంది. పోలవరానికి వంద శాతం నిధులిస్తానంది.. ఎన్నో ప్రభుత్వ సంస్థలను మంజూరు చేసింది. గుజరాత్‌కు కేటాయించిన అణు విద్యుత్తు కేంద్రాన్ని ఎంతో దయతో ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడకు బదిలీ చేసింది. అక్కడి వారు వద్దని మొత్తుకుంటున్నా గుజరాత్ త్యాగం చేసి, మీకిచ్చిందంటూ సన్నాయి నొక్కులూ నొక్కింది. అమరావతి నిర్మాణానికీ ఇతోధికంగా సాయమందిస్తోందనీ పేర్కొంది. ఇవన్నీ నిజమే కావచ్చు. బీజేపీ ఎంత చెప్పినా ప్రజలు నమ్ముతారా. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ పార్టీకి ఆ క్రెడిట్ దక్కుతుందా. టీడీపీ దక్కనిస్తుందా. అలా చేస్తే, టీడీపీ ప్రతిష్ట ఏం కావాలి. రాష్ట్ర మంత్రులు ఇప్పటి వరకూ ఏ ఒక్క సమావేశంలోనైనా ఈ ప్రగతంతా తమ ఘనతేనని చెప్పగలిగారా. మన రాష్ట్రం నుంచే రాజ్యసభకు వెళ్లిన ఎంపీ రైల్వే మంత్రయినా ఇంతవరకూ విశాఖ రైల్వే జోన్‌ను సాధించలేకపోయామే. దీని గురించి, వస్తుంది వస్తుందంటూ చెప్పుకొస్తున్నారే గానీ, ఇంతవరకూ ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడిందా. ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలే దీన్ని వరప్రాదంగా భావిస్తున్నారు. ఈ చిన్న పనినే ఇంతవరకూ చేయని బీజేపీ, రాష్ట్రానికి అంత చేసిందీ ఇంతచేసిందీ అంటే నమ్మి ఓట్లేస్తారా. మహా అయితే మరో రెండు సీట్లు పెరుగుతాయి తప్ప ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండదు. పైగా ఎన్నికల్లో తన దారిన తాను పోటీ చేసే సాహసం చేయబోదు. కేంద్ర నాయకత్వం నిర్ణయించినా రాష్ట్ర నాయకత్వం దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖమన్న సూత్రాన్ని టీడీపీ, బీజేపీ రెండూ పరస్పర అవగాహనతో పాటిస్తున్నాయి. ఇంతటి అనుకూలమైన వాతావరణాన్ని బీజేపీ చెడగొట్టుకునే పనికి పాల్పడదు గాక పాల్పడదు.
హరిబాబు పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత, కొత్త అధ్యక్షుడిగా మరొకరిని ఎన్నుకోలేకపోతోంది. ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమిస్తున్నట్లు ప్రకటన చేసి కూడా ఎందుకో వెనకడుగు వేసింది. ఆ తరవాత దాని ఊసే లేదు. నూతన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటే బీజేపీ-టీడీపీ బంధం విడకూడదు. కొనసాగాలి. ఈ బంధం విచ్ఛిన్నమైతే.. ప్రజల భవిష్యత్తుకు అడ్డంకులెదురవుతాయి. కేంద్రంతో సయోధ్యను నెరపుతున్నందువల్లే ఏపీ అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది. కేంద్రంతో ఘర్షణ పడితే ఎలా ఉంటుందో తమిళనాడు పరిణామాలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేసే సాహసం చేయవు.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి