తెలంగాణ బీజేపీలో ఇప్పుడు బండి సంజయ్ టాల్ అండ్ టాప్ లీడర్‌గా నిలిచారు. మోదీ, అమిత్ షా ఆశీస్సులు ఆయనకే ఉంటున్నాయి. అయితే సీనియర్ల పరిస్థితే ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. బండి సంజయ్ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను పట్టించుకోవడం లేదు. వారి ఫోటోలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ తరపున అమిత్ షాకు ఆహ్వానం పలుకుతూ ఇచ్చిన ప్రకటనల్లో ఎక్కడా… ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల ఫోటోలు లేవు. తమను గౌరవించడం లేదని రఘునందన్ రావు లాంటి వాళ్లు బహిరంగంగానే అసంతృప్తిగా ఉన్నారు.
ఇక ఈటల రాజేందర్‌పై బండి సంజయ్ అసంతృప్తిగా ఉన్నారు. టిక్కెట్ల విషయంలో ఆయనచాలా మందికి హామీలిచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారని తెలియడంతో అలా హామీ ఇచ్చే వారికే టిక్కెట్లు రావని బండి సంజయ్ హెచ్చరించారు. అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా సీనియర్ నేతలు ఒకటి, రెండు సార్లు వ్యతిరేకంగా భేటీ కూడా నిర్వహించారు. వారికి పార్టీ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంలో కిషన్ రెడ్డి సీనియర్లకు మద్దతుగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది.
మోదీ, అమిత్ షా నుంచి వచ్చిన ప్రోత్సాహంతో బండి సంజయ్ మరింత ఏకపక్షంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక తమను పట్టించుకోరని ఆందోళనకు గురవుతున్నారు. తమకు నిరాదరణ ఎదురవుతుందని సీనియర్లు ఎక్కువగా భావిస్తే అది బీజేపీకే నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి.