ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఏపీలో నోటాతో పోటీ పడినా వాటిలో సగం కూడా ఓట్లు తెచ్చుకోలేకపోయినా భారతీయ జనతా పార్టీ నేతలు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటనల్లో… తరచూ ప్రభుత్వంలో భాగస్వామ్యం అనే పదం బయటకు వస్తోంది. గత రెండు, మూడు రోజులుగా… ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌లు అదే పనిగా మీడియాతో మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో పోటీకి వెనుకడుగు వేసిన విష్ణువర్దన్ రెడ్డి అనే మరో నేత కూడా మాట్లాడుతున్నారు. వీరి మాటల్లో ఎక్కడో చోట.. తాము ప్రభుత్వంలో భాగం అవడం… ప్రధాన అంశం కాదని చెబుతున్నారు. అక్కడే అసలు విషయం తేడా కొడుతోంది.
ఢిల్లీలో అమిత్ షా, రామ్ మాధవ్‌లతో జగన్ చర్చలు..!
ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి.. మోడీని కలిశారు. ఏపీ సమస్యలపై… వినతి పత్రం అందించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. అమిత్ షాతో కలిసిన తర్వాత… రామ్‌మాధవ్ ప్రత్యేకంగా ఏపీ భవన్‌కు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశాల ఎజెండా ఏమిటో తెలియదు కానీ.. సాయంత్రానికి ఓ పుకారు అయితే బయటకు వచ్చింది. అదే… ఏపీ ప్రభుత్వంలో బీజేపీకి భాగస్వామ్యం. ఎన్డీఏలో… వైసీపీ చేరుతుందని… ఏపీ ప్రభుత్వంలో బీజేపీ భాగమవుతుందని.. ఆ వదంతుల సారాంశం. విషయం ఏమిటో మాత్రం.. వైసీపీ వర్గాలు నోరు మెదపడం లేదు. అయితే పరిస్థితులను బట్టి చూస్తే కొట్టి పారేయడానికి లేదన్న అభిప్రాయం మాత్రం రాజకీయవర్గాల్లో ఉంది.
ఏపీ కోటాలో కేంద్రమంత్రులు వైసీపీ ఎంపీలేనా..?
సమాఖ్య ప్రభుత్వం కాబట్టి.. కేంద్రంలో ప్రతి రాష్ట్రానికి.. భాగస్వామ్యం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతీ రాష్ట్రానికి సంబంధించి… కచ్చితంగా ఒకరికో ఇద్దరికో కేంద్రమంత్రి పదవులు ఇవ్వడం ఖాయం. బీజేపీకి ఇప్పుడు కేంద్రమంత్రి పదవులు ఇవ్వడానికి.. ఎవరూ లేరు. ఏ నేత ఉన్నా… వారు ఉత్తరాదికే పరిమితమవయ్యారు. జీవీఎల్ యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు కాబట్టి.. ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చిన యూపీ కోటాలోనే ఉంటుంది. ఇక ఏపీలో ఆ స్టేచర్ ఉన్న నేతలు లేరు. కన్నా, పురందేశ్వరి ఎన్నికల్లో పోటీ చేసి కనీసం డిపాజిట్ తెచ్చుకోలేకపోయారు. దాంతో ఇప్పుడు… కేంద్రంలో మంత్రి పదవులు… వైసీపీని ఎన్డీఏలో చేర్చుకుని.. వైసీపీ ఎంపీలకు ఇస్తే బెటరన్న భావన బీజేపీ నేతల్లో ఉంది. అదే సమయంలో… ఏపీ ప్రభుత్వంలో తమ వాళ్లను భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారని చెబుతున్నారు.
బదులుగా ఏపీలో బీజేపీ నేతలకు మంత్రి పదవులా..?
ఏపీలో… భారతీయ జనతా పార్టీ నేతలెవరూ ఎమ్మెల్యేలుగా గెలవలేదు కానీ.. ఇద్దరికి మాత్రం ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి. సోము వీర్రాజు తో పాటు… పీవీ మాధవ్ కూడా.. ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ప్రభుత్వాల్లో భాగస్వాములుగా మారాల్సి వస్తే.. ఈ ఇద్దరికి చాన్స్ ఉంటుంది. అందుకే వీరిద్దరూ… రోజూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తాము ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం.. ప్రధానాంశం కాదని చెబుతూ.. ఆ ఆలోచన ఉందని ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై… రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.