బీజేపీకి ఎదురెళ్లడానికి ఏపీలోని రెండు పార్టీలు రెడీగా లేవు. ఈ విషయం మరోసారి స్పష్టమయింది. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని స్పీకర్ లేదా రాష్ట్రపతి చేయాలని ప్రధాని చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ.. కాంగ్రెస్ సహా పందొమ్మిది రాజకీయ పార్టీలు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పందొమ్మిది పార్టీల్లో టీడీపీ లేదు.. వైసీపీ లేదు.. అన్నింటి కంటే ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ కూడా లేదు. ఎందుకు ఆశ్చర్యమంటే ఆ పందొమ్మిది పార్టీల్లో చాలా వాటితో కేసీఆర్ పని చేయాలని ప్రయత్నించిన వారే. కలిసి పని చేయడానికి సిద్ధపడినవారే. ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేస్తే.. బీఆర్ఎస్ నేతలు కూడా వారితో కలిసి కూర్చుని సమావేశాలు నిర్వహించిన వారే. అయితే ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ మార్చుకున్నారు.
మరి పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతారా అంటే స్పష్టత లేదు. ఇంకా బీఆర్ఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ బీఆర్ఎస్ అనుకూల మీడియా మాత్రం అసలు మోదీ ప్రారంభించడం ఏమిటని విమర్శలు గుప్పిస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా అదే చెబుతోంది. కానీ జాతీయ అంశాలపై ఎక్కువగా స్పందించే కవిత కూడా ఒక్క ట్వీట్ చేయలేదు. ముఖ్య నేతలంతా కంప్లీట్ సైలెన్స్ పాటిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ హాజరవడమో లేకపోతే నామోషీగా ఫీలయితే.. ఒంటరిగానే డుమ్మా ప్రకటన చేయడమో చేస్తుందని అంటున్నారు.
మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలు ఇప్పుడు బీజేపీతో పెట్టుకుని ఇష్యూని డైవర్ట్ చేసుకోవడం కన్నా..తమలో తాము చూసుకోవడం మంచిదని భావించినట్లుగా ఉన్నాయి. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి వెళ్లాలని రెండు పార్టీలూ నిర్ణయించుకున్నాయి. టీడీపీ కూడా బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా వ్యతిరేక వర్గంలో ఉన్నామని అనిపించుకోకూడదనుకునేందుకు తాపత్రయపడుతుంది. ఇక వైసీపీ సంగతి చెప్పాల్సిన పని లేదు.