బీజేపీ అధిష్ఠానం లోక్సభ ఎన్నికల్లో రెండు వ్యూహాలను అమలు చేస్తున్నది. ఒకటి ఎన్నడూ గెలువని స్థానాలను దక్కించుకోవడం. రెండోది కాంగ్రెస్ పక్కాగా గెలిచే చోట తమకు అవకాశం లేకపోతే ప్రాంతీయపార్టీలను కలుపుకుని అక్కడ కాంగ్రెస్ గెలువకుండా చూడటం. కాస్త ఆలోచిస్తే..తెలంగాణ రెండో కేటగిరిలోకి వస్తుంది. కలుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. పార్టీని నిలబెట్టుకోవడం పెద్ద సమస్య అన్నది బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఉన్న ఆందోళన. అందుకే కేటీఆర్ స్వయంగా బీజేపీతో పొత్తుల కోసం సంప్రదింపులు ప్రారంభించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ఇప్పుడు ఏకపక్షంగా లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం లేదు. మొన్నటి ఫలితాల ప్రకారం చూసినా రెండు ,మూడు సీట్లు మాత్రమే లభిస్తాయి. లోక్ సభ ఎన్నికల నాటికి పరిస్థితి మరింత దిగజారి.. జాతీయ పార్టీల మధ్యే పోరు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకే ఏదో ఓ జాతీయ పార్టీతో కలవాలనేది బీఆర్ఎస్ ఆలోచన. రెండుపార్టీలు కలిసి మెజార్టీ సీట్లు సాధిస్తే రాజకీయం మారుతుందని బీఆర్ఎస్ ఆశ. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్న అభిప్రాయం కలిగే వాతావరణం కల్పించి ఆపరేషన్ కమల్ చేపడితే మళ్లీ అధికారం చేతికి వస్తుందని బీఆర్ఎస్ భావన.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు జాగ్రత్తగా గమనిస్తే రెండుపార్టీల టార్గెట్ కాంగ్రెస్ పార్టీనే అన్నది స్పష్టమవుతున్నది. రాజకీయాల్లో శాశ్వత శతృవులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నది నానుడి. లోక్సభ ఎన్నికల్లో ఈ రెండుపార్టీలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీనే. అందుకే ఇక్కడ పార్టీ గెలుపును అడ్డుకోవడానికి ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తాయి. అయితే నేరుగా పొత్తులు పెట్టుకుంటే.. రెండు పార్టీలు నష్టపోతాయి. అప్పుడు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంటుంది. ఈ రెండు పార్టీల్లో ఒకటి పార్లమెంట్ ఎన్నికల నాటికి బలహీనపడే అవకాశం ఉంటుంది. అయితే పరోక్షంగా సహకరించుకుంటే.. ఫలితాలు అనుకున్నట్లుగా వస్తాయన్న నమ్మకం పెట్టుకోలేకపోవచ్చు. అయినా వర్కవుట్ అయ్యేందుకు సూచనలు ఉన్నాయి.