తెలంగాణ ఫలితాల్లో హంగ్ వచ్చే అవకాశాలను కొన్ని ఎగ్జిట్ పోల్స్ తోసి పుచ్చలేదు. ఒక వేళ హంగ్ వస్తే.. ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం లేదు. ఓ రెండు పార్టీలు కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. తెలంగాణ అసెంబ్లీలో మేజిక్ మార్క్ 60. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అరవై అక్కర్లేదు. 53 సీట్లు సాధిస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్కు ఏకపక్షంగా మద్దతు పలుకుతుంది.
కేసీఆర్ ను మళ్లీ సీఎంను చేద్దామని ఓవైసీ బీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువగా పిలుపునిస్తున్నారు. మజ్లిస్ కు ఆరు నుంచి ఏడు స్థానాలు ఖాయం. నాంపల్లి సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. అక్కడ ఫలితం తారుమారైతే ఆరు స్థానాలు ఖాయం. బీఆర్ఎస్కు తగ్గే సీట్లు ఈ వీటితో సరిపోతే పంచాయతీనే ఉండదు. మజ్లిస్ సీట్లు కూడా కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే బీజేపీ వైపు చూడాలి. కొన్ని ఎగ్టిట్ పోల్స్ బీజేపీకి పది నుంచి పన్నెండు సీట్లు ఇచ్చాయి. ఆ సీట్లతో కలిసి రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.
తెలంగాణ ఫలితాల్లో హంగ్ అంటూ వస్తే అసలు పరీక్ష కాంగ్రెస్ పార్టీకే ఎదురవుతుంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నపార్టీకి ఎమ్మెల్యేల్ని కాపాడుకోవడం పెద్ద సమస్య అవుతుంది. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో పోరాడటం సమస్యగా మారుతుంది. అలాగని బీఆర్ఎస్ పార్టీతో కలవలేరు. ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజార్టీని కాంగ్రెస్ సాధించాల్సి ఉంటుంది.