తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని.. .అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రక్రియను కంప్లీట్ చేయాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరగా తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది.అటు, 22మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ కు 35మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. అందులో 22 మందిని కాంగ్రెస్ లో చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయినట్లే. దీంతో పక్కా లెక్కతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎల్పీపై ఫోకస్ పెట్టినట్లు స్పష్టం అవుతోంది.
జులై సెకండ్ వీక్ లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. అంతకుముందే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రాసెస్ ను కాంగ్రెస్ పూర్తి చేయాలనుకుంటుంది. గత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానీ కేసీఆర్ , ఈ సమావేశాలకు హాజరై ప్రభుత్వ లెక్క తేలుస్తానని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేసేలా బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై అధికార పార్టీ నజర్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై కాంగ్రెస్ ఆలోచనలో కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఏమైనా విమర్శలు వస్తాయా..? అని సమాలోచనలు జరుపుతోంది. అయితే, గతంలో బీఆర్ఎస్ ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు విలీనం సంప్రదాయాన్ని కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వైఖరి అవలంభించి బీఆర్ఎస్ ను దెబ్బతీయవచ్చునని తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలపై అప్రమత్తమైన కేసీఆర్, పార్టీని వీడాలని ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.