అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అన్నట్లుగా మారింది బీఆర్ఎస్ పరిస్థితి. తెలంగాణలో హ్యాట్రిక్ విజయం ఖాయమనే ధీమాతో పార్టీ పేరును మార్చి దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ చేసి చతికిలపడింది బీఆర్ఎస్. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి మహారాష్ట్ర , ఓడిశా, ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలను షురూ చేశారు. రాష్ట్ర అధ్యక్షులను కూడా చకచక నియమించేశారు. అంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్యంగా ఓటమి పాలవ్వడంతో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణకు బ్రేకులు పడ్డాయి.
సొంత రాష్ట్రంలో అనూహ్యంగా ఓటమి పాలవ్వడంతో కేసీఆర్ అవమానంగా ఫీల్ అవుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా కేడర్ కు సైతం దూరమయ్యారు. కేసీఆర్ సైలెన్స్ కావడంతో బీఆర్ఎస్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగిలిన నేతలంతా ఎన్నికల సమయంలో జంప్ చేయగా…ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ ఖాళీ అవ్వనున్నట్లు తెలుస్తోంది.
మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు సహా పార్టీ నేతలు మంగళవారం ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలవనుండటంతో… ఎన్సీపీలో బీఆర్ఎస్ విలీనం కానుంది అని విస్తృత ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 6న పూణేలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ఈ నేతలంతా ఎన్సీపీ తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు.