పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర నేతలు హైకమాండ్ కు సమాచారం చేరవేశారని, అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
అయితే, పోలింగ్ కు ముందు బీఆర్ఎస్ లీడర్లను పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుంది..? అని హైకమాండ్ ఆలోచిస్తోంది. ఇప్పటికప్పుడు వారిని పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ కు లాభమా..? బీఆర్ఎస్ పై సానుభూతి పెరిగి ఓటింగ్ పర్సంటేజ్ పై ప్రభావం చూపుతుందా..? అనే కోణంలో హైకమాండ్ ఆరా తీస్తోంది. రాష్ట్ర నేతలతో చర్చించి అనంతరం చేరికలపై హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజాగా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరనే చర్చ మొదలైంది. ఉత్తర తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా వీరు కాంగ్రెస్ లో చేరేందుకు రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతున్నారని టాక్.
పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతారనే వార్త గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్నికల ముంగిట ఈ వ్యవహారం పార్టీని మరింత బలహీనపరుస్తుందా..? అని ఆందోళన వ్యక్తం చేస్తోంది.