ఓట్లు ఎవరిని చూసి వేస్తారు ?. అధికార పార్టీ అయితే ముఖ్యమంత్రిని పాలనను చూసి వేస్తారు. ప్రతిపక్ష పార్టీకి అయితే అధ్యక్షుడు లేకపోతే ఆ పార్టీ తరపున ఎవరు ముుఖ్యమంత్రి అవతారో వారిని చూసి వేస్తారు. భారత ప్రజాస్వామ్యం నేరుగా అధ్యక్షుడ్ని ఎన్నుకోదు. పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ సభ్యులందరూ కలిసి తమ నేతను ఎన్నుకుంటారు. అతడే ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇది రాజ్యాంగాన్ని సంతృప్తి పరచడానికే. మన మేడిపండు తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలో మొదటి నుంచి జరుగుతోంది అధ్యక్ష తరహా ఎన్నికలే. ఎవరు ప్రధాని లేదా ఎవరు ముఖ్యమంత్రి అన్న కాన్సెప్ట్ చుట్టూనే ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఇక ముందూ జరుగుతాయి. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న ప్రజలు లీడర్నే చూస్తున్నారు కానీ ఐడియాలజీని చూడటం లేదు. అది వేరే విషయం. ఇరప్పుడు ఏపీలో జరుగుతున్న మంత్రివర్గ ప్రక్షాళన తంతు చూసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఏ ఉద్దేశంతో తన మంత్రులను మార్చాలనుకుంటున్నారో ఎవరికి అంతుబట్టదు. ఎందుకంటే ఏపీలో పరిపాలన ఇప్పటి వరకూ అధికారవికేంద్రీకరణ జరగలేదు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వేదికగానేమొత్తం పాలన సాగింది. సొంత నిర్ణయాలు తీసుకున్న మంత్రి ఒక్కరూ లేరు. తీసుకోనిచ్చిన స్వేచ్చ కూడా ఎవరికీ ఇవ్వలేదు. మరి ఇప్పుడు మంత్రివర్గాన్ని మొత్తం మార్చి జగన్ ఏం సాధించబోతున్నారు ?
నడిపేది..నడిపించేది వేరే వాళ్లయితే.. మంత్రులేం చేస్తారు !?
ఆంధ్రప్రదేశ్‌కు గౌతంరెడ్డితో కలిపి ఇరవై ఐదు మంది మంత్రులు… ఓ సీఎం ఉన్నారు. ఈ ఇరవై ఐదు మంది మంత్రుల్లో తమ శాఖకు సంబంధించి నిఖార్సుగా సమీక్షలు చేసిన వారు ఎంత మంది ఉన్నారు ?. ఒక్కరంటే ఒక్కరూ లేరు. మొదట్లో ఇసుక విధానంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని సమీక్షలు నిర్వహించేవారు. అవి కూడా సమీక్షలు చేయాలని పై స్థాయిలో వచ్చిన ఆదేశాల మేరకే జరిగేవి. మొదటి ఏడాది తర్వాత ఇక మంత్రుల సమీక్షలే లేవు. ముఖ్యమంత్రి తర్వాత అంత పవర్‌ఫుల్‌గా భావించే హోం మంత్రి పదవిలో ఉన్న సుచరిత ఎప్పుడూ శాంతిభద్రతలపై రివ్యూ చేయనే లేదు. ఆమె విధులు నిర్వహించినది కూడా తక్కువే. హోంమంత్రిగా ప్రోటోకాల్ ప్రకారం హాజరవ్వాల్సిన కార్యక్రమాలకు హాజరవడం పార్టీ తరపున ఏం మాట్లాడాలో ఆదేశాలు వచ్చినప్పుడు మాట్లాడటం మినహా ఆమె చేసిందేమీ లేదు. ఒక్క హోంమంత్రే కాదు.. అన్ని కీలక శాఖల మంత్రులదీ అదీ దారి. చివరికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే అప్పులకు అనుమతుల కోసం ప్రతీ నెలా పదిహేనురోజులు ఢిల్లీలో గడపడమే కానీ.. ఎందుకిలా పరిస్థితి తిరగబడింది.. మేలు జరగడానికి ఏం చేద్దామని ఆయన సమీక్షలు చేసింది లేదు.. సూచనలు చేసిందీ లేదు. ఇక మంత్రులు.. ఏపీ సెక్రటేరియట్లో కనిపించింది అంతంత మాత్రమే. పేరుకు మంత్రులు అయినప్పటికీ అత్యధిక మంది తమ తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యేవారు. ఏమైనా మాట్లాడాలంటే.. నియోజకవర్గాల్లోనే మాట్లాడేవారు. పేరుకే మంత్రులు. నిజానికి ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఆ డిప్యూటీ హోదా వల్ల కనీసం తమ నియోకవర్గానికి అయినా ఒక్కటంటే ఒక్క పని అయినా.. లేదా నిధులు అయినా ఎక్కువ ఇప్పించుకోగలిగారంటే.. అలాంటి చాన్సే లేదనే సమాధానం మొదటే వస్తుంది. అంటే మంత్రులు అందరూ ప్రోటోకాల్ అందుకున్నారు కానీ.. పని చేయలేదని చెప్పుకోవచ్చు.
చేసేదెంతా ఒకరే అయితే మంత్రుల పనితీరుకు మార్కులేంటి !?
అది కరోనా కాలం. టెన్త్ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టి తీరుతామని విద్యామంత్రి ఘంటాపథంగా చెబుతూ వస్తున్నారు. అది ప్రభుత్వ విధానం ఆయనను అలాగే చెప్పమన్నారు. అలా చెప్పేసి ఆయన తన నియోజవకర్గం వెళ్లిపోయారు. కానీ హఠాత్తుగా ఆయనను ఓ మధ్యాహ్నం అమరావతి సచివాలయానికి అర్జంట్‌గా రమ్మని పిలిచారు. ఆయన వచ్చారు. ఓ నోట్ చేతిలో పెట్టి .. వెళ్లి మీడియా ముందు చదవమన్నారు. అదేమిటో ఆయనకు పూర్తిగా తెలియదు. కానీ తాను అప్పటి వరకూ చేసిన ప్రకటనలకు భిన్నంగా ఉన్న నిర్ణయం అని మాత్రం అర్థమైపోయింది. అంటే పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన ఆయన విద్యామంత్రి. నిర్ణయం తీసుకోవాల్సింది ఆయన. కానీ ఆయన పరోక్షంలో ఎవరో నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం ఆయనతో ప్రకటింప చేశారు. ఇది జగన్ సర్కార్‌లో ఓ మంత్రికి ఉండే స్వేచ్చ.. పనిచేసే ఫ్లెక్సిబిలిటీకి ఓ ఉదాహరణ. ఇది ఒక్క మంత్రిది కాదు.. అందరిదీ అంతే. తమ తమ శాఖల్లో ఏం జరుగుతుందో మంత్రులెవరికీ తెలియదు. సంతకాలు పెట్టాలి అని పంపితే సంతకాలు పెడతారు. లేకపోతే అదీ లేదు. ఇలాంటి కట్టుబాట్లు పెట్టిన మంత్రులపై సమర్థత లేదని ముద్ర వేయడం అరాజకీయమే.
సమర్థులు కాదనే బయటకు పంపుతున్నామని ప్రజలకు సందేశం!
కేబినెట్లో కొంత మంది సమర్థులు కావాలి అని … సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. కొడాలి నాని సొంతంగా ఏదీ మాట్లాడరనేది వైసీపీలో అంతర్గత విషయాలు తెలిసిన వారందరికీ తెలుసు. తిట్టు.. గట్టిగా తిట్టు..గతంలో ఎప్పుడూ లేనంతగాతిట్టు అని వచ్చే సందేశాలకు అనుగుణంగానే ఆయన భాష ఉంటుంది. అలాగే… సమర్థులైన వారు కావాలి అని ఆయన అన్నారంటే.. తమను తాము అసమర్థులుగా అంగీకరించడమే. అలా ఏ రాజకీయ నాయకుడు చేయరు. కానీ వైఎస్ఆర్సీపీలో చేయిస్తారు. కొడాలి నాని ద్వారా చేయించారు. కొడాలి నాని చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో తీసివేయబోయేవరందరూ అసమర్థులని అర్థం. వారి వల్లనే మూడేళ్లలో సరిగ్గా పాలన చేయలేదన్న ఓ ముద్రను ప్రజల్లోకి పంపడానికి ముందే ఏర్పాట్లు చేసుకున్నారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మూడేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ఆ మంత్రులపై రుద్దేసి… వారిని తప్పిస్తామని వచ్చేరెండేళ్లు సమర్థవంతమైన పాలన అందిస్తామని ప్రజలకు చెప్పబోతున్నారు. అందుకే ఐదుగురు మంత్రుల్నికొనసాగించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఐదుగురు సమర్థులు.. మిగతా వారంతా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చినవారనేది ప్రజలు అనుకోవాలనేది.. ప్రభుత్వ పెద్దల వ్యూహం అనుకోవచ్చు.
ప్రభుత్వంపై వ్యతిరేకత మంత్రుల వల్లే అని వాళ్లని మార్చి నిరూపించగలరా ?
ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీది ముందు నుంచీ ఓ ప్రత్యేకమైన వ్యూహం. పొరపాటున ఏదైనా మంచి జరిగితే అది జగన్మోహన్ రెడ్డిది.అదే ఏదైనా తప్పు జరిగితే అది గత పాలకులది. అయితే ఎదురుదారి చేయడానికిఈ రాజకీయం బాగుంటుంది. కానీ చివరికి ప్రజలు ఓట్లేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పాలనను బేరీజు వేసుకుంటారు.. అప్పుడు ఈ వాదన సరిపోదు.. మరేంచేయాలి? . ముందుగా చెప్పుకున్నట్లు ఎన్నికలు జగన్ పాలన మళ్లీ కావాలా..వద్దా అన్న ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయి. అంతేకానీ.. ఫలానా మంత్రి పని తీరు ప్రాతిపదికన జరగవు. ఎందుకంటే నిర్ణయాలన్నీ సీఎం జగన్‌వి. ఆయనను నడిపిస్తున్న వారివి. ఆయననను ఎవరు నడిపించినా పాలనకు పూర్తి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డినే. కానీ ఇక్కడ అప్పుడే వ్యూహం ప్రారంభమైపోయింది… అమలవుతున్న పథకాల గొప్ప అంతా జగనమోహన్ రెడ్డిది..కానీ పాలనా వైఫల్యాలు మాత్రం మంత్రులవి. పాపం జగన్‌కేమీ తెలియదు. ఆయన పథకాల అమల్లోబిజీగా ఉంటే మంత్రులే ప్రజా వ్యతిరేకతపెంచి పెద్ద చేశారు.వారిని తప్పించాం.. ఇక ప్రజా వ్యతిరేకత అనేది లేదని నిరూపించాలనుకుంటున్నారు. కానీ ఆచరణలో ఇది ఎంతవరకూ సాధ్యమన్నది వేచి చూడాలి.
ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంత మందిని బలిచ్చినా జగన్ పాలనే ఓటింగ్‌కు ప్రమాణం !
అయితే ప్రజల్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే రాజకీయంలో తగిలేది ఎదురు దెబ్బలే. ఎందుకంటే ముందుగా మనం చెప్పుకున్నట్లుగా పాలకుడ్ని చూసి ఓట్లు వేయడం… అడగడం అన్నదే మన ప్రజాస్వామ్యంలో పాతుకుపోయింది. పార్టీలను బట్టి కూడా కాదు. దేశ ప్రజాస్వామ్యంలో అలాంటి వ్యవ్థ పాతుకుపోబట్టే… అనకే ప్రాంతీ.య పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మూడేళ్లలో జరిగిన తప్పుల్ని మంత్రులపై తోసేసి… కొత్త కేబినెట్‌కు కులాల రంగులుపూసి.. అందరికీ న్యాయం చేశా… ఇక సమర్థవంతమైన పాలన ఇస్తా అని తెర ముందుకు వస్తే ప్రజలు వైఫల్యాలను మర్చిపోవడం కష్టమే. ఎందుకంటే… అసలు ఏమీ చేయకపోయినా ప్రజలు ఏమీ చేయలేదు కదా అనుకుంటారేమో కానీ.. ఏపీలో చాలా జరిగింది. అది పాజిటివ్‌గా కాదు నెగెటివ్‌గా. ఎంత దారుణమైన పరిపాలన అంటే.. సమస్యలు సృష్టించడం.. వాటిని పరిష్కరించలేక..కారణం చంద్రబాబు అనిచెప్పడం మాత్రమే వారికి తెలిసింది. చివరికి కరెంట్ విషయంలోనూ అదే వాదన వినిపిస్తున్నాయి. ఓ వైపు ప్రజలు అల్లాడిపోతున్నారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బిడ్డల్ని కాపాడాలని ప్రజలు. .. పంటలను కాపాడాలని రైతుు గుండెలవిసేలా రోదిస్తున్నారు . కానీ ప్రభుత్వ సమాధానం మాత్రం.. చంద్రబాబు అప్పులు పెట్టిపోయారు.. మోడీ కరెంట్ కొననివ్వడం లేదనేదే. అన్నీ ప్లేటులోకి తెచ్చి ఇస్తే … పంచడం మాత్రమే చేయడానికైతే పాలన ఎందుకు ? అన్ని సంపాదించి తెచ్చి పంచితేనే పాలన. అంతే కాకనీ.. మొత్తం చేతులేత్తేసి.. చేయలేకపోయాం… కానీ తప్పు మాది కాదు…వేరే వాళ్లది అంటే ఇక అధికారంలో ఉండటం ఎందుకు ?
సమర్థతే ప్రామాణికం అయితే తప్పించాల్సింది ముఖ్యమంత్రినే !
సమర్థత లేదన్న కారణంగా మంత్రుల్ని తప్పించాల్సి వస్తే.. ముందుగా తప్పించాల్సింది సీఎం జగన్నే. రాజధాని లేని.. భారీ లోటుతో ప్రారంభమైన రాష్ట్రం…ఐదేళ్లలో ఓ గమ్యస్థానానికి చేరింది. పెట్టుబడిదారులకు స్వర్ఘధామం అయింది. ఓ ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించుకోవడానికి పునాదులు కూడా వేసుకున్నారు. కానీ ప్రజల మధ్య.. కులాలు… ప్రాంతాల చిచ్చు పెట్టి మొత్తంగా ధ్వంసం చేసేసి.. ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నానని… ఇతరులు చేయనివ్వడం లేదని శోకాండాలు పెడుతున్న సీఎం జగన్‌దే చేతకానితనం. ఆయనకు ఏ మాత్రంసమర్థత.. ఆలోచన.. ముందు చూపు.. అంతకు మించి ప్రజల పట్ల.. ప్రజా సంపద పట్ల.. రాష్ట్ర ప్రయోజనాల పట్ల కనీస బాధ్యత లేదని మొదట్లో ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చేసినప్పుడే అర్థమైపోంది. మూడేళ్లలో ఆ విధ్వంసం రాష్ట్రం మొత్తాన్ని దివాలా తీసే స్థితికి చేర్చింది. ఇక్కడ అత్యంత అసమర్థుడు ఎవరైనాఉన్నారంటే అది సీమ్మేననడంలో సందేహం లేదు. కానీ మంత్రుల్ని బలిచేసి.. తప్పంతా వారిదే… పథకాలు మాత్రమే నావని నమ్మించడానికి జరుగుతున్న రాజకీయ ప్రయత్నం ఇప్పుడు ప్రజల ముందు ఉంది. దీన్ని ప్రజలు నమ్ముతారా లేదా.. అన్నది భవిష్యత్‌లో తెలుస్తుంది.