ఈడీ ఆఫీసులోకి వెళ్లినప్పటి నుండి కవిత బయటకు వస్తారా అటు నుంచి అటు జైలుకు వెళ్తారా అని ఇటు ప్రగతి భవన్ నుంచి అటు ఢిల్లీ తుగ్లక్ రోడ్లోని కవిత నివాసం వరకూ ఒకటే టెన్షన్. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు. అరెస్ట్ చేస్తే ఏం చేయాలన్నదానిపై కార్యాచరణ రెడీ చేసుకున్నారు. కానీ కవితను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. సోమవారం రాత్రి వరకూ ప్రశ్నించినా మళ్లీ మంగళవారం ఉదయం 11 గంటలకల్లా రావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో హాజరు కాక తప్పని పరిస్థితి.
తనను ఇంటి వద్దే ప్రశ్నించాలని… సాయంత్రం ఐదు తరవాత వదిలి పెట్టాలని ఇలాంటి రకరకాల షరతులతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది తేలిన తర్వాతనే విచారణకు వస్తానని మొదట లేఖ రాశారు. తర్వాత ప్లాన్ మార్చుకుని విచారణకు హాజరవుతున్నారు. కానీ అరెస్ట్ భయం మాత్రం పొంచి ఉంది. కవితపై పక్కాగా ఆధారాలున్నాయని ఈడీ అధికారులు ఇప్పటికే న్యాయస్థానాలకు చెప్పి ఉన్నారు . డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియానే అరెస్ట్ చేసిన తర్వాత కవితను అరెస్ట్ చేయకుండా ఉండరన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితులందర్నీ ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిలో ఎవరికీ బెయిల్ కూడా రాలేదు. చాలా కాలంగా జైళ్లలోనే ఉంటున్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కుట్ర మొత్తం చేసిన టాప్ త్రీలో ఒకరిగా కవితను పేర్కొంటున్నప్పటికీ ఆమెను మాత్రమే అరెస్ట్ చేయలేదు. మంగళవారం కూడా ఆమె ఈడీ ఆఫీసుకు వెళ్తారు. అయితే బయటకు వస్తారా అటు నుంచి అటు జైలుకు వెళ్తారా అన్నది మాత్రం ఈడీ అధికారుల చేతుల్లోనే ఉంది. వారేమనుకుంటే అదే జరుగుతుంది.