సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు రాజకీయం పూర్తిగా వంటబట్టలేదు. ఆయన జనసేన నుంచి ఎందుకు వెళ్లిపోయారో ఆయనకే తెలియదు. ఏ పార్టీలో చేరాలో ఇప్పటికీ అర్థం కావడం లేదు. కానీ ఆయన మనసు మాత్రం జనసేన వైపే లాగుతోంది. తరచూ జనసేనాని పవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా రణస్థలంలో పవన్ కల్యాణ్ నిర్వహించిన యువభేరీ సభపైనా స్పందించారు. రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో యువకులు ముందుకు వచ్చి తమ గళాన్ని వినిపించడం చాలా సంతోషదాయకమన్నారు. పవన్ కళ్యాణ్ పొత్తులపై కూడా స్పష్టత ఇచ్చారని.. రణస్థలంలో రణానికి స్థలాన్ని కూడా నిర్దేశించారు చెప్పుకొచ్చారు.
లక్ష్మినారాయణ కూడా ఒకే రాజధాని అదీ అమరావతికే కట్టుబడి ఉన్నారు. జనసేన సిద్దాంతాలతో ఏ ఒక్క దాంతోనూ వ్యతిరేకించడం లేదు. టీడీపీలో చేరితే జగన్ కేసుల్లో ఆయన జరిపిన విచారణపై ప్రభావం పడుతుంది. వైసీపీలో చేరలేరు. బీజేపీలో చేరి చేసేదేమీ ఉండదు. చివరికి జనసేనలోనే చేరితేనే బెటరని.. టీడీపీతో పొత్తుంటే.. చట్టసభసభ్యుడిగా ఈజీగా ఎన్నిక కావొచ్చని నమ్ముతున్నట్లుగా ఉన్నారు. అయితే ఆయన తనంతట తాను వెళ్లి జనసేనలో మళ్లీ చేరలేరు. ఎందురంటే ఆయనే వదిలి వెళ్లిపోయారు. తన పార్టీలోకి రావాలని మళ్లీ పవన్ పిలవరు. అక్కడే రాజకీయం స్తంభించినట్లుగా కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని.. వీవీ లక్ష్మినారాయణ చెబుతున్నారు. కుదిరితే ఏదైనా పార్టీ లేకపోతే.. ఇండిపెండెంట్ అంటున్నారు. అయితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టి.. ఖచ్చితంగా ప్రధాన పార్టీనే ఎంపిక చేసుకుంటారు. ఆయనకు ఇంకా పూర్తి స్థాయి రాజకీయం ఒంటబట్టకపోవడంతోనే సమస్య వస్తోందని ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.