ప్రతిపక్ష నేతగా సీఎం జగన్ కోడి కత్తి గీసుకుందో లేదో తెలియని గాయానికి హైదరాబాద్లో మూడు వారాల విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు అలాగే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న అవినాష్ రెడ్డి తల్లికి మూడు, నాలుగు వారాల వైద్యం… విశ్వభారతి ఆస్పత్రిలో అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని డాక్టర్ రితేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంత ఆందోళకరంగా ఉంటే.. హైదరాబాద్, బెంగళూరు కార్పొరేట్ ఆస్పత్రికి తరలించకుండా కర్నూలులోనే ఎందుకు ఉంచారంటే..అక్కడే ఉంది మ్యాజిక్కు అనుకునే పరిస్థితి.
ఇప్పుడు సీబీఐ అధికారులు ఆస్పత్రిలోకి వెళ్లలేరు. వారు బయటకు రారు. లోకల్ పోలీసులు సీబీఐ అధికారులకు సహకరించరు. అంత వరకూ బాగానే ఉన్నా.. సీబీఐ అంత పవర్ లెస్సా అనే డౌట్ అందరికీ రావడం సహజమే. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ కోర్టుకు చెప్పింది కానీ ఎప్పుడు చేస్తామన్నది చెప్పలేదు. ఇప్పటికే అరెస్ట్ కోసం ప్రయత్నాలు చేయలేదు. ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తోంది. అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరవడం అనేది జరగదని తాజా పరిణామాలతో స్పష్టమయింది.
తండ్రి జైల్లో ఉన్నారని..తల్లికి అనారోగ్యంగా ఉన్నందున తాను హాజరు కాలేనని చెప్పే అవకాశం ఉందంటున్నరు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాలేదు. అత్యవసరం అని భావిస్తే రాతపూర్వకంగా ఇవ్వాలని వేకెషన్ బెంచ్ లో విచారణ జరిపేందుకు పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఇప్పుడు ఎమర్జెన్సీ అనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన సుప్రీంకోర్టులో మళ్లీ వెకేషన్ బెంచ్ ముందు విచారణకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు మొదటి నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దర్యాప్తు అధికారులపై కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. చివరికి విచారణాధికారి కూడా మారారు. అయినా కేసు ముందుకెళ్తూనే ఉంది. కానీ సీబీఐకి మాత్రం ఆటంకాలు తప్పడం లేదు. తాము ఇంత బలహీనమా అనే అభిప్రాయానికి వారు రావాల్సి వస్తోంది.